కరీంనగర్ జిల్లాలో మధ్య మానేరు ప్రాజెక్టుకు పడిన గండి రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్ర మంత్రి హరీష్ రావు పై టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి నేరుగా ఆరోపణలు చేశారు. హరీష్ రావు మామూళ్లు తీసుకున్నారంటూ తీవ్రంగా ఆరోపించారు.
మధ్య మానేరు డ్యాముకు గండి పడిన ప్రదేశాన్ని రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కమీషన్లు తీసుకుని కాంట్రాక్టులు కట్టబెట్టారని రేవంత్ ఆరోపించారు. నిర్వాసితుల సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మధ్య మానేరు గండికి పరోక్షంగా ప్రభుత్వానిదే బాధ్యతంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. డ్యామును పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్, బాధిత రైతులను పరామర్శించక పోవడం దారుణమంటూ రేవంత్ విమర్శించారు.
మన్వాడలో భూసేకరణ జరపాలని, తగిన పరిహారం ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఎకరానికి 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కూడా కోరారు. డ్యాముకు గండి పడటం వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది.
ఇప్పటికే మల్లన్న సాగర్ వివాదం కొనసాగుతోంది. వ్యవహారం కోర్టులో ఉంది. అద్భుతమైన ప్యాకేజీ ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఓ విధంగా దండయాత్ర కొనసాగిస్తోంది. గ్రామాల్లో పోలీస్ బందోబస్తుతో యుద్ధ వాతావరణం సృష్టించారంటూ మండిపడుతోంది. ఇప్పుడు మధ్య మానేరు గండి, ప్రతిపక్షాలకు కొత్త అస్త్రంగా మారింది. కాంట్రాక్టువ్యవహారాల్లో అవినీతి జరిగిందంటూ హరీష్ రావుపై నేరగా ఆరోపణ చేసిన రేవంత్, అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. ప్రాజెక్టులు, పరిహారం, అవినీతి వ్యవహారంతో శాసనసభలో మాటల యుద్ధం భీకరంగానే జరగవచ్చు.