కార్పొరేట్ కాలేజ్ ల విషయంలో రేవంత్ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందన్న వార్త విద్యార్థుల తల్లిదండ్రులకు ఆశాదీపంలా కనిపిస్తోంది. ప్రతి ఏటా పెరుగుతోన్న ఫీజులతో తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఫీజుల పెంపుపై పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలపడం.. ఆ తర్వాత ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం షరామామూలుగా మారింది. కానీ, బీఆర్ఎస్ హయాంలో వీటిపై సానుకూల స్పందన రాలేదు.
రేవంత్ కు ఇటీవల కార్పొరేట్ కాలేజ్ ల ఫీజ్ దోపిడీపై ఫిర్యాదులు అందాయి. ఎలాంటి నియంత్రణ లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు వస్తున్నారనే విషయంపై రేవంత్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈమేరకు కార్పొరేట్ కాలేజ్ లను నియంత్రిస్తూ కొత్త చట్టం తీసుకురానున్నారని.. అలాగే ఫీజ్ ల నియంత్రణ చట్టం కూడా తీసుకొస్తారనే వార్త పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రేవంత్ పట్టుదలతో ఉన్నారు. విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ఇప్పటికే సమాలోచనలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజ్ దోపిడీపై ఫిర్యాదులు అందటంతో యాక్షన్ ప్లాన్ కు రెడీ అయ్యారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. లోక్ సభ ఎన్నికలపై ప్రస్తుతం ఫోకస్ పెట్టిన రేవంత్.. ఎన్నికలు ముగియగానే ఈ అంశంపై దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.