తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో అధికార పగ్గాల కోసం తెర వెనక వ్యూహాలు నడుస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి ఆసక్తికరమైన ఆరోపణలే చేశారని అనాలి! ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ తరచూ మాట్లాడుతూ… కారు వేగంగా పోతోందనీ, ఇలాంటి సమయంలో డ్రైవర్ ని మార్చొద్దని ప్రజలకు చెబుతున్నారన్నారు. ‘వాస్తవానికి కారు డ్రైవర్ ని మార్చాలని ప్రయత్నిస్తున్నది మీ బావ హరీష్ రావు, ఈ విషయం కేసీఆర్ కూడా తెలుసుకోవాల’ని రేవంత్ వ్యాఖ్యానించారు.
గత నెల 25వ తేదీ సాయంత్రం, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ నర్సారెడ్డిని తన వాహనంలో ఎక్కించుకుని రాత్రి తొమ్మిదిన్నరకు మంత్రి హరీష్ రావు క్వార్టర్స్ కి తీసుకెళ్లారు అని చెప్పారు రేవంత్. ఆ తరువాత, మూడు గంటల సేపు హరీష్ రావుతో నర్సారెడ్డి మాట్లాడారన్నారు. ఆ మర్నాడే, హైదరాబాద్ నుంచి విమానమెక్కి నర్సారెడ్డి ఢిల్లీకి హుటాహుటిన వచ్చి, కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్నారు. వాస్తవానికి, కాంగ్రెస్ లో ఉండే నర్సా రెడ్డి తెరాసలో చేరి, కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారనీ, కానీ హరీష్ రావు కలిసిన మర్నాడే ఆయన ఎందుకు కాంగ్రెస్ లో చేరారు అనేది ప్రజలకు మంత్రి వివరించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావుతో చర్చల తరువాతే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారంటేనే కేసీఆర్, హరీష్ రావుల మధ్య పరిస్థితి ఎలా ఉందనేది అర్థమైపోతోందన్నారు. తుఫాను ముందు ప్రశాంతత, విచ్ఛిన్నం కాబోయేముందు నిశ్శబ్దంలా తెరాసలో ఆధిపత్య పోరు ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు.
మినిస్టర్ కార్టర్స్ లోని సీసీ కెమెరా ఫుటేజ్ లన్నీ బయటపెట్టాలనీ, 25 నాడు సాయంత్రం ఏడు నుంచి రాత్రి 1 గంట వరకూ హరీష్ రావు అధికారిక నివాసంలోకి వెళ్లిన కార్లు, బయటకి వచ్చిన కార్లు, వాటిలో ఉన్న ప్రముఖులు ఎవరనేది బయటపెడితే… తెర వెనక జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకి, కేటీఆర్ కి, తెలంగాణ సమాజానికీ స్పష్టత వస్తుందన్నారు.
తెరాసలో ఆధిపత్య పోరు అనే చర్చ ఇప్పటి కాదు. కానీ, ఎప్పటికప్పుడు దీన్ని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు ఖండిస్తూనే ఉన్నారు. తాజా ఎన్నికల ప్రచారంలో కూడా ఓ సభలో ఇటీవలే కేటీఆర్ కూడా తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవనీ, కేసీఆర్ నాయకత్వం కోసం సమష్టిగా పనిచేస్తున్నామనీ అన్నారు. కానీ, నర్సారెడ్డి చేరికను ఊటంకిస్తూ రేవంత్ చేస్తున్న ఈ ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావు స్పందించాల్సిన అవసరమైతే ఇప్పుడు కనిపిస్తోంది.