మూసీ నదిని థేమ్స్ లా చేద్దామని అధ్యయనం చేద్దామని రేవంత్ రెడ్డి పిలవగానే మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ లండన్ లో దిగిపోయారు. ఇద్దరూ కలిసి ఫోటోలు దిగి మీడియాకు పంపారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న మైండ్ గేమ్ పాలిటిక్స్ లో కొత్త కోణం ఆవిష్కృతమయింది. ప్రభుత్వం కూలిపోతుందంటూ కామెంట్లు చేస్తున్న వారికి ఇది ఓ హెచ్చరికగా మారింది.
సాధారణంగా మజ్లిస్ వ్యూహం అధికార పార్టీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది. మజ్లిస్ పాతబస్తీలో తమ బేస్ ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే తెలంగాణ అధికార పార్టీతో సన్నిహితంగా ఉండి.. పాతబస్తీలోకి అడుగు పెట్టకుండా చూసుకుంటుంది. మిగతా తెలంగాణ మొత్తం ఆ పార్టకి మద్దతుగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి అలాగే మద్దతుగా నిలిచింది. కేసీఆర్ మళ్లీ సీఎం అవడానికి చాలా మద్దతు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే బీఆర్ఎస్కే మద్దతుగా ఉండేందుకు మజ్లిస్ సిద్దంగా లేదు.
ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర పరిమితంగా కనిపిస్తోంది. మజ్లిస్ కు కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉండటమే కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ ప్రచారం చేసినా ముస్లిం వర్గాలు బీఆర్ఎస్ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు మొగ్గారని ఓటింగ్ సరళిని బట్టి అర్థమవుతుంది. జాతీయ రాజకీయాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమిలు అన్నట్లుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో బీఆరెస్, ఎంఐఎంలు ఏదో ఒక పక్షంకు ఎన్నికల ముందు లేదా తర్వాతా మద్దతునివ్వక తప్పని పరిస్థితి తలెత్తవచ్చు. మజ్లిస్ ఎప్పుడూ ఏ కూటమిలో నేరుగా చేరదు.. తెర వెనుక సహకారంకు మాత్రమే పరిమితమవుతుంది.