తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా ఏకమయ్యారు. రేవంత్ రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడయిన తర్వాత ఒకే వేదికపై కలవని వారంతా ఇందిరాపార్క్ వద్ద దీక్షలో కలిసి మెలిసి కనిపించారు. దీక్ష చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని మోసం చేస్తున్నాయని తక్షణం వారి నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో టీ కాంగ్రెస్ ఇందిరా పార్క్ వద్ద రెండు రోజులు దీక్ష చేయాలని నిర్ణయించింది. శని, ఆదివారాలు దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు సీనియర్లు అందరూ తరలి వచ్చారు.
ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డిని కలవడానికి కూడా ఆసక్తి చూపని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి పక్కన కూర్చుని ముచ్చట్లు పెట్టారు. కలిసి అభివాదం చేశారు. ఒక్క ఉకోమటిరెడ్డి మాత్రమే కాదు.. ఉత్తమ్ సహా అందరూ హాజరయ్యారు. వీహెచ్ కూడా వచ్చి ఉత్సాహంగా మాట్లాడారు. ఈ వరి దీక్ష చూస్తే కాంగ్రెస్ పార్టీలో పాత రాజకీయాలన్ని ఇక మటుమాయం అయ్యాయని.. అందరూ ఏకతాటిపైన పని చేస్తారని కాంగ్రెస్ క్యాడర్ సంతృప్తి పడుతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత రేవంత్ రెడ్డిని సీనియర్లు టార్గెట్ చేసారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
అయితే హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డికే మద్దతు లభించింది. ఈ క్రమంలో తానేంటో చూపిస్తానని సవాల్ చేసిన వెంకటరెడ్డి కూడా ఇప్పుడు మనసు మార్చుకున్నారు. వరి దీక్షలో ఆయన హావభావాలు చూస్తే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయడానికి సిద్ధమైనట్లేనన్న అభిప్రాయానికి అందరూ వస్తున్నారు. అందరూ చేతులు కలిపితే కాంగ్రెస్‌కు ఎదురుండదని క్యాడర్ నమ్ముతున్నారు.