రాజకీయాలు భలే చిత్రంగా ఉంటాయి. ఏం మాట్లాడినా అందులో తప్పులు వెదికి ఇది మిమ్మల్ని అవమానించడమే అని ఇతర వర్గాలపైకి తోసేస్తూంటారు. ఇప్పుడు ఐటీ ఉద్యోగులపై బీఆర్ఎస్ ప్రేమ కురిపిస్తోంది. మిమ్మల్ని రేవంత్ రెడ్డి అవమానించారని అంటోంది. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. “ కేటీఆర్ ఐటీ ఎంప్లాయి.. ఆయన ఐటీ ఎంప్లాయిగానే ఆలోచించి పాలసీలు చేశారు. కానీ పాలసీ మేకర్స్ లాగా ఆలోచించలేదు” అని అన్నారు. దావోస్లో మీడియా ప్రతినిధితో మాట్లాడినప్పుడు తెలంగాణలో ఐటీ పాలసీలపై అడిగినప్పుడు ఇలా చెప్పారు.
కేటీఆర్ ను ఐటీ ఉద్యోగిగా చెప్పడం .. ఐటీ ఎంప్లాయిస్ ను అవమానించడమేనన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. విచిత్రంగా కేటీఆర్ కూడా ఓ పెద్ద ట్వీట్ పెట్టారు. నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడారని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి వారి జీవనోపాధిని పొందుతున్నారు. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న నా అక్కాచెల్లెళ్ళకు, అన్నాదమ్ముళ్ళకు సలాం అని ట్వీట్ పెట్టారు. మీ విద్యార్హతలకు, మీ నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు. అలాంటి వాళ్ళు ప్రవేశపట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నమని… నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికి గర్వకారణమని ప్రకటించారు.
ఇంతగా ఎందుకు స్పందించారో ఐటీ ఉద్యోగులకూ అర్థం కాదు. రేవంత్ రెడ్డి తమను ఏదో అన్నారని వారు అనుకోవాలన్నట్లుగా ట్వీట్ ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి ఏమన్నారో ఆ వీడియో ఎటాచ్ చేస్తే సరిపోయేది. కానీ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. రాజకీయాల్లో ఎవరి భావోద్వేగాలతో రాజకీయం చేయడమే కీలకం. ఐటీ ఉద్యోగులకు రాజకీయాలతో అంత సంబంధం ఉండదు. ఐటీ ఉద్యోగం చేసిన కేటీఆర్ .. తనను ఐటీ ఉద్యోగి అనడం తక్కువ చేయడం అని ఎలా అవుతుందో కానీ.. మొత్తంగా ఓ రాజకీయం అయితే ప్రారంభమయిందని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.