ఉప్పూ-నిప్పుగా ఉండే నేతలు ఒకే వేదికపై కనపడితే…? ఊహించుకోవటానికే చాలా మందికి కష్టంగా ఉంటుంది. గతంలో అయితే పాలకపక్షమైనా, ప్రతిపక్షమైనా నేతలంతా ఎంత విమర్శించుకున్నా… వ్యక్తిగతంగా సంబంధాలు ఉండేవి. కానీ, ఇప్పుడవి ఊహించుకోవటమే కష్టంగా మారిపోయింది.
ఏ చిన్న అవకాశం దొరికినా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ ను తిట్టకుండా వదలరు. ఫ్యామిలీ మొత్తాన్ని తిడుతూనే… కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ పరుష పదజాలం వాడుతుంటారు. సీఎం అయ్యాక కూడా ఆయన తిట్లు తగ్గలేదు.
ఇటు కేటీఆర్ కూడా అంతే. సీఎం అయినా, రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నా మాటల తూటాలు ఆగలేదు. రేవంత్ రెడ్డిని ఎక్కడ దొరుకుతారా…? అన్నట్లుగా కేటీఆర్ అండ్ టీం వెయిట్ చేస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదలరు.
అలాంటిది ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనపడితే…? కానీ, ఇది నిజం. ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ ఒకే వేదికపై కనపడబోతున్నారు. తీవ్ర అనారోగ్యంతో మృతిచెందిన సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి సంతాప సభ ఈ నెల 21న హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ కు కూడా ఆహ్వానం అందించారు రాష్ట్ర సీపీఎం పార్టీ నేతలు. వీరిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సైతం ధృవీకరించారు.