రేవంత్, కేటీఆర్ మధ్య ఏ అంశంలోనూ ఏకాభిప్రయం ఉండదని అనుకుంటారు కానీ.. దక్షిణాదికి అన్యాయం విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. స్టాలిన్ నేతృత్వంలో పోరాడేందుకు వారు సిద్ధమయ్యారు. శనివారం చెన్నైలో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కీలక పార్టీల నేతల సమావేశానికి రేవంత్ తో పాటు కేటీఆర్ కూడా హాజరవుతున్నారు. ఇరువురూ చెన్నైకి బయలుదేరి వెళ్లారు.
స్టాలిన్ కాంగ్రెస్ కూటమిలో కీలక నేత. ఆయన సమావేశం పెట్టి పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్లాలి. ప్రభుత్వం తరపున సీఎం.. పార్టీ తరపున మహేష్ గౌడ్ హాజరవుతున్నారు. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం శివకుమార్ హాజరవుతున్నారు. కేటీఆర్ కూడా తాను వస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ కూడా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై స్పందిస్తున్నారు. స్టాలిన్ సమావేశానికి వెళ్లకపోతే మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదని ఆయన కూడా వెళ్తున్నారని అనుకోవచ్చు.
అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పై భీకరంగా పోరాడుతోంది.మరో వైపు ఆ పార్టీ తో కలిసి బీజేపీపై పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఇది తెలంగాణలో కొన్ని రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ బీజేపీని .. బీఆర్ఎస్ పల్లెత్తు మాట అనడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ తోనూ కలిసి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బీఆర్ఎస్ ఎలా తన రాజకీయ విధానాలకు అనుగుణంగా మార్చుకుంటారన్నది ఆసక్తికరం.