రూ. రెండు లక్షలు.. ఆగస్టు పదిహేను లోపు.. ఒకే సారి రుణమాఫీ. ఈ హామీ సహజంగానే ఆకర్షిస్తుంది. ఆమలు చేసే స్థితిలో ఉన్న వారు ఇస్తే ఇక తప్పనిసరిగా నమ్మాల్సిందే. నమ్మకపోతే ఆ రెండు లక్షలపై ఆశలు వదిలేసుకోవడమే. రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు ఇలాంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. ఆగస్టు పదిహేను లోపు .. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారసభల్లో ఇది చెబుతున్నారు.
ఓటు వేస్తేనే రుణమాఫీ చేస్తానని ఆయన చెప్పడం లేదు. వేసినా.. వేయకపోయినా చేయాల్సిందే. కానీ రేవంత్ రెడ్డి ఇక్కడే అసలు రాజకీయం చూపిస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొడతారని ఇతర పార్టీల నేతలు చేస్తున్న సవాళ్లను కూడా ఇదే సభలో చెబుతున్నారు. అంటే ఓటు వేసి కాంగ్రెస్ ను బలోపేతం చేయకపోతే రిస్క్ లో పడిపోతామని ఆయన చెప్పదల్చుకున్నారు. తన అభిప్రాయాన్ని ప్రజల్లోకి కరెక్ట్ గానే పంపుతున్నారు.
రుణమాఫీ హామీకి విపక్షాలు కూడా మంచి పబ్లిసిటీ ఇచ్చాయి. కిషన్ రెడ్డి అయితే దీక్ష చేశారు. బీఆర్ఎస్ నేతలు ప్రతీ రోజూ గుర్తు చేస్తూంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని రేవంత్ రుణమాఫీ అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నారు కాబట్టి.. అమలు చేయకపోతే… రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారన్న భయంతోనైనా అమలు చేస్తారని అనుకుంటున్నారు. ప్రజల్లో దీనిపై ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత మంచిదని ఆయన అనుకుంటున్నారు. అందుకే డెడ్ లైన్ పెట్టి మరీ ప్రకటన లు చేస్తున్నారు.