బీఆర్ఎస్ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు రేవంత్ రెడ్డికి కలసి వస్తున్నాయి. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ రేవంత్ రెడ్డి కోసమే కట్టించినట్లయిందన్న సెటైర్లు మొదట్లోనే వినిపించాయి. ఇప్పుడు ఉద్యోగ నియామకాల ప్రక్రియ కూడా రేవంత్ కు క్రెడిట్ వచ్చేలా చేశారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. నియామకాల ప్రక్రియ పూర్తయిన ఉద్యోగాలకు.. రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారు.
ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి.. తానే ఉద్యోగం ఇస్తున్నట్లుగా చెప్పుకుని మరీ ఇస్తున్నారు. మొదట మొడికల్ స్టాఫ్.. తర్వాత పోలీసు ఉద్యోగాలను వేలల్లో నియామక పత్రాలు ఇచ్చారు. తాజాగా గురుకుల టీచర్స్, లైబ్రేరియన్లకు నియామక పత్రాలు ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. 2 వేల మందికి అపాయింట్ లెటర్లు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 23,147 ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందని చెప్పుకున్నారు. 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని.. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో విఫలం అయిందని రేవంత్ విమర్శిస్తున్నారు.
మా ప్రభుత్వం వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయించాం. 2004 స్పూర్తితో ముందుకెళుతున్నామని చెబుతున్నారు. ఈ నియామక పత్రాల కార్యక్రమాలు, రేవంత్ స్పీచ్‌లు చూసి బీఆర్ఎస్ నేతలు బాధపడుతున్నారు. ఇంకాస్త వేగంగా ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలకు ముందే అందరికీ నియామక పత్రాలు అందించి ఉంటే.. చాలా క్రెడిట్ వచ్చేది కదా అని మథన పడుతున్నారు.