ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెలంగాణా రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా గురువారం యూనివర్సిటీలో తెలంగాణా నిరుద్యోగ ఐకాస అధ్వర్యంలో జనజాతర కార్యక్రమం నిర్వహించాలనుకొంది. తెలంగాణాలో నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో జనజాతర సభ నిర్వహించాలని భావించిన తెలంగాణా నిరుద్యోగ ఐకాస దానికి వివిధ పార్టీలకి చెందిన రాజకీయనాయకులను కూడా ఆహ్వానించడంతో అది రాజకీయ కార్యక్రమంగా మారింది. యూనివర్సిటీ ఆవరణలో ఎటువంటి రాజకీయ సభలు, సమావేశాలు జరపడానికి వీలు లేదని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ విద్యార్ధులు సభ నిర్వహించడానికి సిద్దపడ్డారు..తెలంగాణా తెదేపా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి సీనియర్ నేతలు కోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ యూనివర్సిటీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.
యూనివర్సిటీల వ్యవహారాలలో రాజకీయ నాయకులు వేలు పెట్టిన ప్రతీసారి కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు కూడా చాలా జటిలం అవుతాయి చివరికి అవి జాతీయ సమస్యలుగా కూడా మారుతాయని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జె.ఎన్.యు.లో జరిగిన ఘటనలు రుజువు చేశాయి. అయినప్పటికీ యూనివర్సిటీలకు రాజకీయ నాయకులు దూరంగా ఉండలేకపోతున్నారు. న్యాయవ్యవస్థలే మాటిమాటికి జోక్యం చేసుకొని వారిని కట్టడి చేయవలసి వస్తోంది. ప్రజలకు ఆదర్శంగా నడుచుకోవలసిన రాజకీయ నాయకులు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టు ధిక్కారానికి కూడా వెనుకాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.