” తనపై మంచి ప్రచారం జరుగుతుందా..చెడు ప్రచారం జరుగుతుందా.. అన్నది రాజకీయ నాయకుడికి ముఖ్యం కాదు.. ఏదో ఓ ప్రచారం జరుగుతుందా లేదా.. అన్నదే ముఖ్యం..” : విన్స్టన్ చర్చిల్ కాలం మారుతున్నా.. రాజకీయం మాత్రం మారదు. రాజకీయ నాయకుడికా కావాల్సింది ప్రచారమే. నెగెటివ్ ప్రచారం జరిగితే.. అది ఆయన ఇమేజ్‌కు దెబ్బేస్తుందని అనుకోవడం అమాయకత్వమే. మంచో .. చెడో ప్రజల నోట్లో నానితేనే రాజకీయ నాయకుడికి భవిష్యత్. ఇది ఇండియా రాజకీయాల్లో మరింత ముఖ్యం. అందునా.. మీడియా విశ్వరూపం ప్రదర్శించే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరింత అవసరం. అందుకే.. మీడియా సంస్థలన్నీ రాజకీయ గుప్పిట్లో చేరిపోయాయి.
అయితే.. కొన్ని టీవీ చానళ్లు.. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోలేక.. తమ యాజమన్యానికి బద్దశత్రువు అయిన రాజకీయ నేతపై కసి చూపించుకోవాలన్న ఉద్దేశంతో.. బోలెడంత సమయం కేటాయించి.. ప్రచారం చేసి పెడుతున్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది టీవీ9. కొద్ది రోజులుగా టీవీ 9 పెడితే.. రేవంత్ రెడ్డి తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అందులో ఆయన కబ్జాలు.. దాడులు.. దౌర్జన్యాలు అంటూ… ప్రసారాలు చేస్తున్నారు. ఆయనను దెబ్బకొడుతున్నామని అనుకుంటున్నారు. కానీ.. టీవీ9 అసలు చేసింది…రేవంత్ ను హైలెట్ చేయడం. దేశం మొత్తం.. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచం మొత్తం కరోనా గురించి గంగవెర్రుతెత్తిపోతోంది. ఏ మీడియాలో అయినా ఆ వార్తలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. డ్రోన్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న రేవంత్ ను పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు. కానీ.. ఆ బాధ్యత టీవీ9 తీసుకుంది. ఆయనను పదే పదే గుర్తు చేస్తూ.. రేవంత్ పోరాటయోధుడనే విషయాన్ని నెగెటివ్ యాంగిల్లోనే ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
రాజకీయ నాయకుడిపై దుష్ప్రచారం చేసి.. అతన్ని దెబ్బకొడదామనుకుంటే.. ఎప్పటికీ సాధ్యం కాదు. అలాంటి సాక్ష్యాలు ఇప్పుడు కళ్ల ముందు ఉన్నాయి. దానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డినే ఉదాహరణ. ఆయనపై జరిగింది దుష్ప్రచారమో.. నిజంగానే అవినీతికి పాల్పడ్డారో.. ఎవరికీ తెలియదు కానీ ఆయనకు.. మీడియాలో లభించిన ప్రచారం అంతా ఇంతా కాదు. రాజకీయాలకు సంబంధం లేదని అవినీతి పైనే ఆ ప్రచారం ఎక్కువగా ఇచ్చింది మీడియా. ఇదే ఆయనవిజయానికి దోహదం చేసింది. ఇప్పుడు.. రేవంత్ విషయంలోనూ టీవీ9 అదే చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అంతిమంగా రేవంత్ తన లక్ష్యం చేరితే.. మొదటగా టీవీ9కే ధ్యాంక్స్ చెప్పుకోవాలేమో..?