తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి తన హత్యకు కుట్ర పన్నుతున్నారని అనుమానిస్తున్నారు. తాను తెలంగాణలో అత్యంత బలమైన వ్యక్తులతో పోరాడుతున్నానని.. వారు తన హత్యకు కుట్ర పన్నుతున్నారని ఆయన అంటున్నారు. అందుకే.. తనకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఎంపీగా రేవంత్ రెడ్డికి సాధారణ భద్రత ఉంది. ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీతో ఎస్కార్ట్ కల్పించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్, మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు పేర్లను ప్రముఖంగా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్‌తో పాటు ఆయన సన్నిహితుల భూ అక్రమాలపై.. తాను కోర్టుల్లో పిటిషన్లు వేసి పోరాడుతున్నానని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను వ్యక్తిగతంగా కూడా వైరంగా చూస్తూంటారని పిటిషన్లో పేర్కొన్నారు. ముఖ్యంగా… మైహోమ్ గ్రూప్ అధినేత, ఇటీవల టీవీ9ను కొనుగోలు చేసిన జూపల్లి రామేశ్వరరావు నుంచి ప్రాణహాని ఉందని.. రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయనకు.. హైదరాబాద్‌లో అత్యంత విలువైన భూములు అప్పనంగా కట్టబెట్టడంపై.. హైకోర్టులో పిటిషన్ వేశానని .. రేవంత్ కోర్టు దృష్టి తీసుకెళ్లారు. నిజానికి రేవంత్ రెడ్డి భద్రత కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రేవంత్‌కు త్రీ ప్లస్ త్రీ భద్రత ఉండేది.
ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో.. టూ ప్లస్ టూకి తగ్గించారు. గత ముందస్తు ఎన్నికలకు ముందు ఆ భద్రతను కూడా తగ్గించడంతో.. రేవంత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పట్లో ఆయనకు భద్రతను పునరుద్ధరించారు. కానీ వెంటనే… తగ్గించారు. ఆ తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వానికి కూడా దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకూ.. ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఆ దరఖాస్తు రిజెక్ట్ చేయలేదు. దాంతో.. తాను చేసుకున్న విజ్ఞప్తి మీదే ఉత్తర్వులు జారీ చేయాలని.. రేవంత్ రెడ్డి హైకోర్టును కోరారు.