కట్టెపట్టుకుని కాపాడుకుంటే అంతా రేవంతే చూసుకుంటాడని బీసీ సంఘాలకు సీఎం హామీ ఇచ్చారు. ప్రజాభవన్ లో బీసీ సంఘాలు, నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. అసలు కులగణన ఆలోచన.. దాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పడిన కష్టం.. దేశంలో ఎంత ఆదర్శనీయంగా కులగణన సర్వే జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు. చిన్న తప్పు కూడా లేదని ఉంటే చెప్పాలన్నారు. ఉద్దేశపూర్వకంగా నమోదు చేసుకోని కొంత మంది కోసమే రీ సర్వే చేస్తున్నామన్నారు.
కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తూ.. బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. సీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలుగానే జనాభా శాతాన్ని చెప్పారని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో 5 కేటగిరీలు ఉన్నాయన్నారు. ముస్లింలలో ఓబీసీలను నాడు కేసీఆర్ ప్రభుత్వం విడిగా చెప్పలేదని గుర్తు చేశారు. గుజరాత్లో కూడా ఓబీసీ ముస్లింలు ఉన్నారని ప్రధాని మోదీ చెప్పారని.. బీసీల లెక్క తేలితే మాకేంటి.. అని ఆ వర్గం అడుగుతారని బీజేపీ, బీఆర్ఎస్ భయపడుతోందన్నారు.
కులగణన తప్పు అయితే ఎక్కడ తప్పు ఉందో చూపించండి అని బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. చారిత్రాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది.. భవిష్యత్లో కులగణన విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బీసీలంతా కాంగ్రె్స ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.