తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి “ప్రో కేసీఆర్ మీడియా”పై మొదటి డైరక్ట్ ఎటాక్ ప్రారంభించారు. తన నివాసంలో ఐటీ రైడ్స్ సందర్భంగా కొన్ని చానెళ్లు, పత్రికలు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాల సమయంలో తనపై ప్రసారం చేసిన ఆ చానెళ్లు, పత్రికలు వెంటనే అవి తప్పుడు వార్తలని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాటిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని…లేకుంటే పరువునష్టం కేసు వేస్తానని రేవంత్ హెచ్చరించారు. నిజానికి రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల సమయంలో.. మీడియా పాత్ర చాలా వివాదాస్పదమయింది. ఆ సమయంలో జరిగిన ప్రచారం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగిన సమయంలో… ఆయన కొడంగల్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. సాయంత్రం.. ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లోకి వెళ్లిన వెంటనే… కొన్ని పత్రాలు మీడియా చేతికి వచ్చాయి. వాటిలో రేవంత్ రెడ్డి కి సంబంధించి విదేశాల్లో ఖాతాలున్నాయి.. వందల కోట్ల లావాదేవీలు జరిగాయన్న విషయాలు ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు… ఈ డాక్యుమెంట్లు అసలైనవి అనేలా భ్రమలు కల్పిస్తూ.. బ్రేకింగ్ న్యూసులతో హడావుడి చేశారు. రేవంత్ రెడ్డి ఇంట్లో రెండు రోజుల పాటు సోదాలు చేసిన ఐటీ అధికారులు.. అంత వరకూ రేవంత్‌కు ఫోన్, టీవీ అందుబాటులో ఉంచలేదు. అంటే రేవంత్‌కు తెలియకుండానే.. బయట మీడియాలో మాత్రం.. ప్రచారం అయిపోయింది. ఇదంతా ప్లాన్డ్గా.. రేవంత్ ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్ర చేశారన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమయ్యాయి. తర్వాత అదే నిజమయ్యాయి. ఆ డాక్యుమెంట్లలో ఉన్న వివరాలు నిజమైతే.. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉండేవాళ్లే.
రేవంత్ పై దుష్ప్రచారం చేసిన మీడియా తర్వాత సైలెంట్ అయిపోయింది. వాటిపై ఎలాంటి విరవణ ఇవ్వలేదు. దాంతో రేవంత్.. నేరుగా హెచ్చరికలు పంపించారు. నిజానికి ఇప్పుడు టీవీ చానళ్లు.. తెలంగాణకు సంబంధించినంత వరకు పత్రికలన్నీ.. ప్రో కేసీఆర్ విధానంలో ఉన్నాయి. ఆయన రాజకీయ వ్యూహాలను అమలు చేయడానికి ప్రత్యర్థులపై బురదజల్లడానికి కూడా వెనుకాడటం లేదు. పైగా… ప్రధానమైన టీవీ చానళ్లలో.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు రేవంత్ మాట్లాడేవీ ఏవీ ఆయా చానళ్లలో రావు. ఇలా డీఫేమ్ చేసే ఫేక్ డాక్యుమెంట్లను మాత్రం విరివిగా ప్రసారం చేస్తారు. ఇప్పుడీ మీడియాపై కూడా రేవంత్.. తన పోరాటాన్ని ప్రారంభించారని అనుకోవాలి.