తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రెండు అధికార పార్టీలను ఎదుర్కొంటూ నిలబడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. రెండూ రాజకీయ ప్రత్యర్థులే. రెండు బలమైన ప్రత్యర్థి వర్గాలను ఎదుర్కొనే శక్తి తెలంగాణ కాంగ్రెస్ కి ఉందా అనేదే అసలు అనుమానం! ఎందుకంటే, వరుస ఓటముల వల్ల వచ్చిన నీరసం ఒకెత్తు అయితే, ఆధిపత్య పోరు మరో సమస్య. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారనే చర్చ బలంగానే జరుగుతోంది. తెరాస, భాజపాలకు ఎదుర్కొనే నాయకుడు ఆయనే అనేది హైకమాండ్ నమ్మకం. దానికి తగ్గట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెరాస, భాజపాలపై ఆరోపణల దాడి మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది.
సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందనేందుకు కావాల్సిన ఆధారాలను బయటపెడతానని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ లాలూచీ పడ్డాయని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ లు కమిషన్ల కోసం తెరాస ప్రభుత్వంతో కక్కూర్తిపడ్డారని అన్నారు. వీటన్నింటికీ సంబంధించి ఆధారాలు ఉన్నాయనీ, త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి దీనిపై ఫిర్యాదు చేస్తాననీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూస్తానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 40 వేల కోట్ల అవినీతి జరిగిందని లక్ష్మణ్, నడ్డాలు విమర్శిస్తారే తప్ప… కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని రేవంత్ నిలదీశారు. సోలార్ పవర్ కొనుగోళ్లలో లుకలుకల్ని ఆసరాగా చేసుకుని సీఎం కేసీఆర్ ని లొంగదీసుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోందనీ, ఇది పార్టీ రాజకీయ ఎత్తుగడ అని రేవంత్ విమర్శించారు. తెరాస ప్రభుత్వం భాజపాకి మద్దతు పలుకుతుంటే.. గడచిన ఎన్నికల్లో తెరాసకు మద్దతు పలికిన మజ్లిస్ పార్టీ ముస్లిం సోదరులకు ఇప్పుడు ఏం చెబుతుందని కూడా రేవంత్ అన్నారు.
సోలార్ పవర్ కొనుగోళ్లలో అవకతవకలంటున్న రేవంత్ దగ్గర ఉన్న ఆధారాలేంటో మరి! ఆయన అంత ధైర్యంగా రెండు అధికార పార్టీలపై తీవ్ర ఆరోపణలకు సిద్ధమయ్యారంటే… సరైన ప్రిపరేషన్ లేకుండా మాట్లాడారని అనుకోలేం కదా. అవినీతిలో రెండు పార్టీలకూ వాటా ఉందన్న స్థాయిలో రేవంత్ చేసిన తీవ్ర ఆరోపణలపై ఆ రెండు పార్టీలూ ఎలా స్పందిస్తాయో చూడాలి. కేంద్రానికి ఫిర్యాదు కూడా చేస్తామంటున్నారు కదా! ఏదేమైనా, రెండు పార్టీలపై రేవంత్ మాటల దాడి షురూ అయినట్టుగానే కనిపిస్తోంది. నిజానికి, పార్టీపరంగా కాంగ్రెస్ కి ఇలాంటి వైఖరితో దూకుడుగా ఉండే నాయకుడి అవసరం కూడా ఇప్పుడుంది.