రేవంత్ రెడ్డి గత రెండు, మూడు రోజులుగా మారిపోయారు. ఆయన మాటలు పాత రేవంత్ రెడ్డిని గుర్తుకు తెస్తున్నాయి. ఇంద్రవెల్లిలో లోక్సభ ఎన్నికల ప్రచారభేరీ సభలో ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారిపై ఘాటు భాషలో విరుచుకుపడ్డారు. పండబెట్టి తొక్కుతామని కట్టేసికొడతామని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో రేవంత్ సంయమనంతో వ్యవహరిస్తూండటంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ మనుగడపై ఎక్కువ కామెంట్లు చేస్తున్నారు. దీంతో రేవంత్ మాటలతోనే ఎదురుదాడికి దిగారు.
తాజాగా ప్రాజెక్టుల అప్పగింత అంశంపై జరుగుతున్న వివాదంలో.. తప్పంతా బీఆర్ఎస్ చేసి..ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయడంతో రేవంత్ ఆవేశంతో ఊగిపోయారు. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. గతంలో కేసీఆర్ వాడిని అత్యంత బూతుపదాలతోనే విరుచుకుపడ్డారు. రేవంత్ మాట్లాడిన మాటలు సమర్థనీయమా కాదా అన్న సంగతి కంటే.. గతంలో కేసీఆర్ అన్న మాటలేగా అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. రాజకీయాల్లో మనం ఏది చేస్తే అది రివర్స్ వస్తుందని… తామే కింగులమని ఎవరికీ చాన్స్ రాదని విర్రవీగితే ఇలాంటి పరిస్థితి వస్తుందని సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అందర్నీ ఇష్టం వచ్చినట్లుగా తిట్టేవారు. ఇప్పుడు ఆయన మాటలు పడాల్సి వస్తోంది. దీనికి బీఆర్ఎస్ వద్ద సమాధానం ఉండే అవకాశం లేదు.
సబ్జెక్ట్ విషయంలోనూ రేవంత్ రెడ్డి సూటిగా ఉంటున్నారు. ప్రాజెక్టుల్ని అప్పగించించి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పత్రాలతో సహా బయటపెట్టారు. ఎన్నికల్లో లబ్ది కోసం సాగర్ ప్రాజెక్టుపై పైకి ఏపీ పోలీసులు వచ్చేలా కుట్ర చేసింది కూడా కేసీఆర్, జగన్ రెడ్డేనని.. . రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. చేయాల్సినదంతా చేసి ఇప్పుడు కాంగ్రెస్ పై నిందలేయడంపై రేవంత్ సీరియస్ గా ఉన్నారు. ఈ విషయంలో నల్లగొండలో సభ పెట్టాలనుకుంటున్న బీఆర్ఎస్కు అంతకు ముందే గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. తన సహజశైలికి భిన్నంగా ఉంటున్నారు. కానీ రెండు నెలల్లోనే ఆయనను పాత రేవంత్ రెడ్డిని చేయడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆయన చేతిలో అధికారం ఉంది. రేవంత్ ను తట్టుకోగలరా అన్నదే ఇప్పుడు అసలు బీఆర్ఎస్ నేతల ముందున్న ప్రశ్న