కొద్దిరోజుల కిందట, హైదరాబాద్లో సొంత ఆఫీస్ ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించినప్పుడు చెప్పిన మాట ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇకపై కేసీఆర్ సర్కారు మీద తన పోరాటం షురూ అన్నారు. కానీ, వెంటనే మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఆ టాపిక్ పక్కనబెట్టేయాల్సి వచ్చినట్టుంది. ఇప్పుడు త్వరలో తన మార్కు పోరాటం ప్రారంభమౌతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు.
సొంత నియోజక వర్గం కొడంగల్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… కొడంగల్ ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్నారనీ, కానీ ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ప్రత్యేకంగా కేటాయించింది లేదనీ, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. భూకేటాయింపుల్లో, ఐటీ హబ్స్ నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న శాఖల్లో అవినీతి చాలా జరిగిందన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేసే ఆలోచనలో ఉన్నా అన్నారు. తండ్రీ కొడుకులు చేసిన అవినీతి మీద, వారు కొనుక్కున్న భూముల మీద, అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల మీద, అక్రమ భూకేటాయింపుల మీద సమాచారమంతా సేకరించామన్నారు. ఇలాంటి వివరాలతో ఒక పుస్తకం ప్రచురిస్తా అన్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తామన్నారు. కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేసే అనుమతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తారా లేదా, సుప్రీం కోర్టు తలుపు తట్టి ఈ కార్యక్రమాలు చెయ్యొచ్చా అనేది ఆలోచిస్తున్నామన్నారు.
రేవంత్ త్వరలో చేయబోయే ఆరోపణలన్నింటికీ నిర్దిష్టమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయనే అంటున్నారు. అంతేకాదు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఒక్కోటిగా వచ్చే నెల నుంచి విడుదల చేస్తానని చెప్పారు. గతంలో కూడా ఇలానే ఓసారి పక్కా ప్రణాళికతో పోరాటానికి దిగుతున్నా అని రేవంత్ ప్రకటించిన సందర్భాలున్నాయి. గత నెలలోనే భారత్ బచావో కార్యక్రమం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సందర్భంగా కూడా రేవంత్ ఇలాంటి ప్రకటనే చేశారు. ఆ వెంటనే రాష్ట్రంలో తన పోరాటం మొదలౌతుందని ఢిల్లీలో చెప్పారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ అవినీతీ ఆస్తులపై వచ్చే నెల నుంచి పోరాటం షురూ అంటున్నారు. ఇదైనా కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి.