తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి చెందిందిగా చెబుతున్న ఫామ్ హౌస్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు ఉపయోగించిన కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గతవారంలో ఆయన్ని అరెస్టు చేస్తే… ఇవాళ్ల ఆయన బెయిల్ పిటీషన్ పై కూకట్ పల్లి కోర్టులో విచారణ జరిగింది. రేవంత్ తరఫు లాయర్ మాట్లాడుతూ.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేసులు పెట్టారనీ, ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా పెట్టినవి అంటూ కోర్టుకు తెలిపారు. పాత కేసులకు సంబంధించిన పీటీ వారెంట్ ను పోలీసులు అడిగారంటూ పోలీసుల తరఫున న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. చాలాసేపు జరిగిన వాదనల అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం.
ఒక పార్లమెంటు సభ్యుడికి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం ఇల్లీగల్ అన్నారు రేవంత్ తరఫు న్యాయవాది. వేరే కేసుల గురించి రేవంత్ గానీ, ఆయన కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఆ అంశాల్ని ఇప్పుడు తెర మీదికి తెచ్చి హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేవంత్ ని రిమాండ్లో ఉంచడం కూడా అన్యాయమని వాదించామన్నారు. ఆరు సెక్షన్లపై ఆయనపై కేసులు పెట్టారనీ, ఐపీసీతోపాటు ఎయిర్ క్రాఫ్ట్ సెక్షన్లను కూడా పెట్టారన్నారు. ఇవేవీ కోర్టు ముందు నిలిచేవి కావనీ, వాటికి సంబంధించిన సరైన వివరాలను కూడా ఇంతవరకూ కోర్టుకు సమర్పించలేదనీ, రేపు రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కేటీఆర్ ఫామ్ హౌస్ మీద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ఎగరేశారన్న వివాదంలో 8 మందిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. గత విచారణలో వారిలో ఆరుగురికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ కి కూడా రేపు బెయిల్ వస్తుందని కాంగ్రెస్ నేతలూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత, ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.