దేవరయాంజల్ సీతారామస్వామి ఆలయ భూములను ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులు కబ్జా చేశారని వచ్చిన ఆరోపణలపై తెలంగాణ సీఎం కేసీఆర్ నలుగురు సీనియర్ ఐఏఏస్ అధికారులతో విచారణ కమిటీ నియమించారు. అయితే ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్‌ను.. ఎంపీ రేవంత్ రెడ్డి మీడియా ముందు బయట పెట్టారు. సీతారామస్వామి ఆలయ భూములను కొనుగోలు చేసిన వారిలో మంత్రి కేటీఆర్‌తో పాటు.. నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు కు భూములు ఉన్నాయని డాక్యుమెంట్లు బయట పెట్టారు. పదో ..పరకకో ఆ భూములు కొన్నారని… అదెలా సాధ్యమని ఆయన ప్రశ్నిస్తున్నారు. నమస్తే తెలంగాణ పత్రికకు చెందిన ప్రింటింగ్ ప్రెస్కూడా… సీతారామస్వామి ఆలయ భూముల్లోనే ఉందన్నారు. ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వందల కోట్లు తెచ్చుకున్నారని ఆరోపించారు.
అంతే కాదు.. మంత్రి మల్లారెడ్డి అక్కడ ఏడెకరాల్ని కబ్జా చేసి.. ఫామ్ హౌస్ కట్టుకున్నారని కూడా ప్రకటించారు. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ. దేవరయాంజల్ కూడా.. ఆయన నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. దీంతో ఆయన ఈ భూవివాదం మొత్తాన్ని సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు వచ్చారు. నిషేదిత జాబితాలో ఉన్న 437 సర్వేలో మంత్రి కేటీఆర్, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు కు భూములున్నాయని.. సేల్ డీడ్ కాపీలు బయట పెట్టారు. మంత్రి మల్లారెడ్డి సర్వే నెం. 658 లో 7 ఎకరాలను ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టుకున్నారని… 2015 లో కేటీఆర్ 11 లక్షలకు ఎకరం చొప్పున కొన్నారని.. కోట్ల విలువ భూములను అంత తక్కువ కు ఏలా కొన్నారని రేవంత్ ప్రశ్నించారు. అదే సమయంలో దేవరాయాంజల్ భూముల ఆన్లైన్లో లేవు.
ధరణిలో హైడ్ కేటగిరి కింద ఉంచారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. 95 ఏళ్లుగా దేవరయాంజల్ ఆలయ భూముల లావాదేవీలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈటలను తొలగించిన విధంగానే కబ్జా మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలను శాఖల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విచారణలో నిజాయితీ లేదు..అనుకూలంగా నివేదికలు తెప్పించుకుంటున్నారని… బ్యాంకులను కూడా తప్పుదోవ పట్టించినందున సీబీఐ విచారణ చేయించాలని… రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అమిత్ షాకు ఆధారాలు సమర్పిస్తానని ప్రకటించారు. ఈ వ్యవహారంలో రేవంత్ కొత్త విషయాలు బయటపెట్టడంతో… ముందు ముందు దేవరయాంజల్ భూముల వ్యవహారం కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.