ప్రియాంకా రెడ్డి అంశమై రాజకీయ పార్టీల నాయకులంతా స్పందిస్తున్నారు. ప్రభుత్వంపై, పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి వైఫల్యమనీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి ఆయన చెడ్డపేరు తెస్తున్నారంటూ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఇంత దారుణ ఘటన జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారంటూ విమర్శించారు. ఇతర పార్టీల నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మల్కాజ్ గిరీ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఇలాంటి సందర్భంలో రాజకీయ పార్టీల విమర్శలు సాధారణంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపేవిగా మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అయితే, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలనే సూచనలు చెయ్యాల్సిన సందర్భం ఇది. రేవంత్ రెడ్డి స్పందనలో ఇలాంటిదే ఒక పాయింట్ ఉంది.
అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, సైబరాబాద్ డీసీపీ ఆఫీస్ కి దగ్గర్లో ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటు అన్నారు రేవంత్ రెడ్డి. ఈ ఘటనలో పోలీసులు విఫలం చెందడానికి కారణం పాలకుల తీరే అన్నారు. నేరస్థుల పట్ల నిత్యం నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన పోలీసు వ్యవస్థ మొత్తాన్ని రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారన్నారు. ఇతర పార్టీల నాయకులపై నిఘా పెట్టేందుకు పోలీసు వ్యవస్థని ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఈ కారణం వల్లనే తాగుబోతులు, తిరుగుబోతులు, నేరస్థులపై నిఘా కొరవడిందనీ, విచ్చలవిడిగా తిరుగుతున్నారన్నారు. ఈ దారుణ సంఘటనకు నేరస్థులు ఎంత బాధ్యులో, పోలీసులూ సీఎం కేసీఆర్ కూడా అంతే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
తిరుగుబోతులూ తాగుబోతులపై నిఘా అన్నది ఆలోచించదగ్గదే అనొచ్చు. ఈరోజుల్లో ప్రజల డేటా అంతా ప్రభుత్వం దగ్గరుంది. దాని ఆధారంగా గ్రామాల్లో, పట్టణాల్లో పనీపాటా లేకుండా ఖాళీగా ఉన్నవారు ఏం చేస్తున్నారూ అనేది నిత్యం ఓ కన్నేసి ఉంచాలంటే పోలీసులకు పెద్ద కష్టమేమీ కాదు. నిరంతరం తాగుతూ రోడ్లపై కనిపించేవాళ్లంతా ఏం చేస్తుంటారు అనే నిఘా పెడితే మంచిదే. గ్రామాల్లో, పట్టణ వీధుల్లో ఇన్ఫార్మర్లను పోలీసులు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసుకుని, ఈ తాగుబోతూ తిరుగుబోతులపై నిరంతరం ఓ కన్నేసి ఉంచితే చాలావరకూ ఇలాంటి వారిని రోడ్ల మీదికి రాకుండానే ముందుగానే కట్టడి చెయ్యొచ్చు. రేవంత్ విమర్శల్లో మరో పాయింట్… పోలీసులంటే నాయకులపై నిఘా పెట్టేందుకు మాత్రమే అధికార పార్టీ వాడుకుంటుందని. సామాన్యుల్లో కూడా దాదాపు ఇలాంటి అసహనమే ఉంది. ఇలాంటివి జరిగినప్పుడు చెయ్యాల్సిన న్యాయంపై ఎంతగా ఇప్పుడు మాట్లాడుతున్నారో, ఇలాంటి జరక్కుండా ఉండాల్సిన చర్యలపై కూడా అంతే తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇది.