తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఎలా ఉంటాయంటే… వామ్మో, రేపట్నుంచీ బ్రహ్మాండం బద్దలైపోతుంది అనిపిస్తుంటాయి! కానీ, ఆ మాటలు చేతలు రూపు దాల్చుతున్న దాఖలాలే కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాలపై విరుచుకుపడే సందర్భంలో చాలాచాలా చెబుతారు! ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే వదిలేది లేదనీ, చేసిన ఆరోపణలు నిరూపించకలేకపోతే వారిపై కేసులు పెడతామని గతంలో చెప్పారు. అంతేకాదు, దీని కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని అన్నారు. నిరూపించండి, లేదా శిక్ష అనుభవించండీ అంటూ అప్పట్లో చెప్పారు. అయితే, ఈ మాటలు ప్రస్తుతం మరిచిపోయారో ఏమో..? తాజాగా ప్రభుత్వ అవినీతిపై పలువురు నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా.. కేసీఆర్ సర్కారు స్పందన శూన్యం!
తెలంగాణలో కొన్ని విత్తన కంపెనీలకు మేలు చేసే విధంగా కేసీఆర్ నిర్ణయాలు ఉంటున్నాయంటూ టీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నకిలీ విత్తనాలను అరికట్టకుండా అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ఇక, భాజపా నేత నాగం జనార్థన రెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రూ. 2400 కోట్ల అవినీతి జరిగిందనీ, దీన్లో ముఖ్యమంత్రికి కూడా భాగస్వామ్యం ఉందని అన్నారు. అంతేకాదు.. ఈ ఆరోపణలపై తనపై చర్యలు తీసుకున్నా సిద్ధమే అని సవాలు కూడా చేశారు. కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే.. చేతనైతే తనపై కేసు పెట్టాలంటూ కేసీఆర్ సర్కారుకు ఛాలెంజ్ విసురుతూ ఆరోపణలు చేశారు. చేప పిల్లల కుంభకోణంలో దాదాపు రూ. 300 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. ఈ స్కాములో ముఖ్యమంత్రి కుటుంబానిదే సింహభాగం అన్నారు. ఈ ఆరోపణలకు తాను కట్టుబడి ఉంటాననీ, కావాలంటే తనపై కేసులు పెట్టేకోవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ సర్కారుపై విపక్షాలకు చెందిన ప్రముఖ నేతల ఆరోపణలు ఇలా ఉన్నాయి! కానీ, వీటిపై కేసీఆర్ సర్కారు స్పందించింది లేదు. కనీసం విమర్శల్ని తిప్పికొట్టిందీ లేదు. ఆధారం లేని ఆరోపణలు చేస్తే కేసులు పెడతామని గతంలో హూంకరించిన సర్కారు.. ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నట్టు..? అంటే, వారు చేస్తున్న ఆరోపణల్ని అంగీకరిస్తున్నట్టు భావించాలా..? భారీ ఎత్తున చేస్తున్న ఈ అవినీతి ఆరోపణలపై స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? చట్టం తీసుకొస్తామంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఆయనే మరచిపోయారా..? లేదంటే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలే అమలు కావడం లేదని అనుకోవాలా..? ఆ చట్టం సంగతి పక్కనపెట్టినా… ప్రభుత్వంపై ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తుంటే వాటిపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా!