తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో దానిని కూల్చివేసేందుకు కాంగ్రెస్, తెదేపా నేతలు కొందరు కుట్రలు చేస్తున్నారని, కనుక జాగ్రత్తగా ఉండమని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనను హెచ్చరించారని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. ఏదో విధంగా తన ప్రభుత్వాన్ని కూల్చివేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించబడేలా చేసేందుకు కుట్రలు జరిగాయని కానీ తాను అప్రమత్తంగా ఉండి తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగానని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘బెర్లిన్ గోడ కూలిపోలేదా?’ అని అన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ‘తెరాస ప్రభుత్వం ఎన్నాళ్ళు సాగుతుంది?’ అని అనడాన్ని కెసిఆర్ అందుకు నిదర్శనంగా చెప్పారు.
కెసిఆర్ బయట పెట్టిన ఆ రహస్యంపై తెదేపా తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చెపుతున్న మాట వాస్తవమే అయితే, ఎవరు ఆ కుట్ర పన్నారో అసదుద్దీన్ ఓవైసీ తక్షణం బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటువంటి అబద్దాలు చెపుతూ తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టి వారి సానుభూతి పొందాలని చవకబారు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలని నెరవేర్చకుండా, వట్టి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసి అడిగే రోజు దగ్గరలోనే ఉందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ఒకవేళ కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి నిజంగా కుట్ర జరిగి ఉండి ఉంటే రెండేళ్ళ తరువాత ఇప్పుడు తాపీగా ఆ విషయం ఎందుకు చెపుతున్నట్లు? ఇప్పటికీ ఆ కుట్ర గురించి దాపరికం దేనికి? మద్యలో ఓవైసీ ప్రస్తావన చేయడమెందుకు?అనే సందేహాలు కలుగుతాయి. తన ప్రభుత్వంపై ఈగ వాలితేనే చాలా హడావుడి చేసి ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టి వారి సానుభూతి పొందే ప్రయత్నం చేసే కెసిఆర్, తన ప్రభుత్వం కూల్చివేయడానికి తెర వెనుక కుట్రలు జరుగుతున్నాయని తెలిసి నిశబ్ధంగా ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. ఒకవేళ అటువంటి కుట్రలు జరిగి ఉండి ఇప్పటికైనా వాటిని బయటపెడితే ప్రజలే అది నిజమో కాదో గ్రహిస్తారు కదా? కెసిఆర్ ఇప్పుడు కుట్ర సంగతి ఎందుకు చెపుతున్నారంటే రాష్ట్రానికి ప్రతిపక్షాలు, ఆంధ్రా పాలకుల వలన చాలా ప్రమాదం పొంచి ఉందని, ఒక్క తెరాస మాత్రమే తెలంగాణాకి రక్షణ కవచంగా నిలిచి కాపాడగలదనే తన వాదనని బలపరుచుకోవడానికేనని భావించవచ్చు.