మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్,బీజేపీ చేస్తున్న విమర్శలకు రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ సమాధానం ఇచ్చారు. పది నెలలుగా 33 మంది అధికారుల బృందం అన్ని విధాలుగా సర్వే చేసిందన్నారు. మూసి ఆక్రమణల వల్ల హైదరాబాద్ నగరానికే ముప్పు వస్తుందని .. వర్షం నీళ్లు ఎక్కడికిపోతాయని ప్రశ్నించారు. వానపడినప్పుడు ట్రాఫిక్ ఆగితేనే ప్రభుత్వాన్ని తిట్టుకోవడం లేదా అని ప్రశ్నించారు.
మూసీ ప్రక్షాళనపై రేవంత్ బీఆర్ఎస్, బీజేపీలకు సూటిగా సవాల్ చేశారు. అసెంబ్లీలో చర్చిద్దాం.. ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు చర్చిద్దాం.. మీకున్న అనుమానాలు చెప్పండి.. ప్రతీ దానికి సమాధానమిస్తానని స్పష్టం చేశారు. ఈ చర్చను సవాల్ గా తీసుకోవద్దని సలహాలు ఇచ్చేందుకు రావాలన్నారు. ఈ అంశంపై చర్చకు గజ్వేల్ నియోజకవర్గంలో లేదా బీఆర్ఎస్ అగ్రనేతుల కేసీఆర్, కేటీఆర్, హరీష్ నియోజకవర్గాల్లో ఎక్కడికి రమ్మన్నా సెక్యూరిటీ లేకండా వస్తానని చర్చిద్దామని సవాల్ చేశారు.
మూసి ప్రక్షాళన విషయంలో రేవంత్ రెడ్డి చాలా సూటిగా, స్పష్టంగా తేల్చేశారు. మూసి ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నరారని ఇప్పటికి డీపీఆర్ తయారు చేయడానికి ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలను సంప్రదించామన్నారు. ఏం కట్టాలి.. ఏం చేయాలన్నదానిపై ఓ స్పష్టతకు వచ్చిన తర్వాతనే నిధుల గురించి తేలుతుందన్నారు. నిధుల కోసం కొన్ని మార్గాలను ఇప్పటికే అన్వేషించామన్నారు. మూసి నిర్వాసితులుక పూర్తి న్యాయం చేస్తామన్నారు. మూసి ప్రాజెక్టు వద్దంటున్న హరీష్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్ వెళ్లి నిర్వాసితులు ఖాళీ చేసిన ఇళ్లల్లో మూడు నెలలు ఉంటే ప్రాజెక్టు ఆపేస్తామన్నారు. ఇప్పటి వరకూ అయిన ఖర్చును తన ఆస్తులు అమ్మి ప్రభుత్వానికి జమ చేస్తానని సవాల్ చేశారు.
మూసీని ప్రక్షాళన చేయాలన్నది గతంలో బీఆర్ఎస్ ప్లాన్. ఇప్పుడు వ్యతిరేకిస్తున్న అంశాన్ని రేవంత్ తెలివిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నరు. పేదల ఇళ్లు పోతాయన్న కారణం చూపి కేటీఆర్..తాము వ్యతిరేకిస్తామని అంటున్నారు. కానీ పరిష్కారం మాత్రం చెప్పడం లేదు. దీన్ని రేవంత్ తన ప్రెస్మీట్ ద్వారా ఎక్స్పోజ్ చేసినట్లయింది.