విభజన సమస్యలకు పరిష్కారం రావాల్సి ఉందని ఆరో తేదీన ముఖాముఖి భేటీ అవుదామని తెలుగుదేశం పార్టీ అధినేత., ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ముఖాముఖి భేటీలో సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రబాబునాయుడు లేఖలో తెలిపారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాలు చర్చించుకోవాల్సి ఉందన్నారు. అవసరమైతే చంద్రబాబుతో భేటీ అవుతానని పలుమార్లు చెప్పారు.
విభజన చట్టంలో పెట్టిన అనేక అంశాలకు పదేళ్లతో గడువు తీరిపోయింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కూడా లేదు. కానీ ఉమ్మడి ఆస్తుల విభజన జరగలేదు. ఏదో ఓ పరిష్కారం చూపించుకోవాల్సి ఉందన్న అభిప్రాయంలో రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఎలాంటి ఒప్పందానికి వచ్చినా రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు మన సంపదను ఇతర రాష్ట్రానికి దోచి పెట్టారని ప్రచారం చేస్తాయి. అందుకే ముందడుగు వేయలేకపోయారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.
చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సర్కారుు నుంచి ఇంకా అధికారిక స్పందన లేదు. సీఎం రేవంత్ రెడ్డి గత స్పందనలను బట్టి చూస్తే ఆయన వంద శాతం అంగీకరిస్తారన్న ప్రచారం ఉంది. ఒక్క సారి కన్ఫర్మేషన్ అయ్యాక సమావేశం ఎక్కడ నిర్వహించాలి.. విధివిధానాలు ఏమిటి అన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు, రేవంత్ ముఖాముఖి భేటీ రాజకీయంగానూ పెను సంచలనం అయ్యే అవకాశం ఉంది.