టాలీవుడ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఊహించనంత భిన్నంగా సాగింది. సాధారణంగా ఇండస్ట్రీ ప్రముఖులంతా వస్తే వచ్చే వాతావరణం ఒకలాగా ఉంటుంది. కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన టాలీవుడ్ – ప్రభుత్వం సమావేశం మాత్రం పక్కా ప్రొఫెషనల్ అన్నట్లుగా సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని డామినేట్ చేశారు. దాదాపుగా ఆయన టాలీవుడ్ కు క్లాస్ తీసుకున్నారు.
సమావేశం ప్రారంభానికి ముందే సంధ్యా ధియేటర్ ఇష్యూలో వీడియో క్లిప్ వేసి చూపించారు. పోలీసు ఉన్నతాధికారులు ఓ సందేశం ఇచ్చారు. బౌన్సర్ల వినియోగం విషయంలో రూల్స్ చెప్పారు. పోలీసుల అనుమతిని బట్టే ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకోవాలన్నారు. తర్వాత ముఖ్యమంత్రి.. టాలీవుడ్ ప్రముఖుల నుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వంవైపు నుంచి పూర్తి సహకారం చిత్రపరిశ్రమకు ఉంటుందని అందులో ఎటు వంటి సందేహాలు పెట్టుకోవద్దన్నారు. అయితే ఆ సహకారం ఏ స్థాయిలో ఉండాలన్నది కూడా తర్వాత తన మాటల ద్వారా చెప్పారు.
డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. తెలంగాణలోని టూరిజం,ఎకోటూరిజంకు ప్రచారం చేయాలి. ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రచారం చేయాలన్నట్లుగా ఆయన చెప్పారు. అభిమానుల్ని కట్టడి చేసుకోవాల్సిన బాధ్యత హీరోలదేనన్నారు. ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలని స్పష్టం చేశారు.ప్రపంచసినీ రంగానికి హైదరాబాద్ కేంద్రంగా ఉండేలా తమ విధానాలు ఉంటాయని రేవంత్ స్పష్టం చేశారు.
తర్వాత సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను చెప్పారు. ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా సినీ పరిశ్రమ పని చేస్తుందన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కల్పించాల్సిన సౌకర్యాలపై మాట్లాడారు. ఇంటర్నేషనల్ స్థాయి ఫిల్మ్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఉండాలని నాగార్జున సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తే గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. ఓటీటీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా మారేలా అభివృద్ది చెందాలని సురేష్ బాబు అన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ అయ్యేందుకు తమ సహకారం అందిస్తామన్నారు.
దాదాపుగారెండు గంటల పాటు జరిగిన సమావేశంలో సంధ్యా ధియేటర్ అంశం గురించి మాట్లాడారు కానీ ఎవరూ అల్లు అర్జున్ కేసు గురించి ప్రస్తావించలేదు. కోర్టులో ఉన్నఅంశంపై ప్రస్తావించకూడదని అందరూ సైలెంటుగా గా ఉన్నారు. మరోసారి అలాంటివి జరగకుండా చూసుకుంటామని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాఘవేంద్రరావు సూచించారు.
మొత్తంగా రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ కు క్లాస్ తీసుకున్నారు. అదే సమయంలో టాలీవుడ్ కూడా తమకువచ్చి న అవకాశాన్ని వినియోగించుకుందని అనుకోవచ్చు.