తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావాలని మాట్లాడతారో.. ఫ్లోలో వచ్చేస్తాయో కానీ ఆయన చేసే ప్రసంగాల్లో కొన్ని మాటలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. ఇలా బుధవారం కూడా ఆయన చేసిన మార్చురీ వ్యాఖ్యలు రాజకీయాల్లో మంట పుట్టించేలా ఉన్నాయి. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కొంత మంది తన స్టేచర్ ను ప్రశ్నించడంపై స్పందించారు. ఇటీవల రేవంత్ రెడ్డికి సీఎం పదవి నిర్వహించే స్టేచర్ లేదని ఆయన ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.అయితే కేసీఆర్ పేరును నేరుగా ప్రస్తావించకుండా సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు.
స్టేచర్, స్టేచర్ అని కొంత మంది అటున్నారని స్టేచర్ వ్యక్తిని బట్టి ఉండదన్నారు. పదవిని బట్టి ఉంటుందన్నారు. ఆ స్టేచర్ గురించి మాట్లాడిన వాళ్లు ఇప్పుడు స్ట్రెచ్చర్ మీద ఉన్నారని కొద్ది రోజులు పోతే మార్చురీలో ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి కేసీఆర్ చావు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ మండిపడింది. కేటీఆర్ చాలా ఆవేశంగా ట్వీట్ పెట్టారు. రేవంత్ రెడ్డిని డీసెన్సీ లేని మ్యాడ్ డాగ్ అని ట్వీట్ పెట్టారు. ఆయనను అర్జంట్ గా ఆస్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు సూచించారు. హరీష్ రావు కూడా స్పందించారు. రేవంత్ కు రాజకీయ పరిక్వత లేదని.. అందుకే ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్నారని మండిపడ్డారు.
రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీకి హాజరయ్యారు. తదుపరి సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అనుకున్న సమయంలోనే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో సెగలు రేగడానికి మరో కారణంగా మారింది.