ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మై హోం గ్రూప్ అధినేత రామేశ్వరరావుకి ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. అయితే, ఈ స్నేహం కోసమే రామేశ్వరరావుకి మేలు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించారనీ, ఆ ప్రయత్నానికి భాజపా సానుకూలంగా స్పందించిందనీ, ఆ రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం ఎంత బలంగా ఉందనడానికి ఇంతకంటే ఇంకేం కావాలంటూ ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. కేసీఆర్ తో, మై హోం రామేశ్వరరావుతో కమీషన్ల కోసం కక్కూర్తిపడి రాష్ట్ర భాజపా నేతలు చేతులు కలుపుతున్నారంటూ విమర్శించారు.
మూడు రోజుల క్రితం, మీ హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మై హోం రామేశ్వరరావుని ఢిల్లీకి తీసుకెళ్లి, కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిపించారన్నారని చెప్పారు రేవంత్. ఎందుకంటే… కర్నూల్లో జేజ్యోతీ సిమెంట్స్ కి సంబంధించిన మైనింగ్ లీజులు అక్రమంగా ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఆ రద్దు నిర్ణయాన్ని తొలిగించి, వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాలను మై హోమ్ సిమెంట్ కంపెనీకి కట్టబెట్టడానికి ప్రయత్నించారన్నారు. ఇదే మాటను మీ పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్దిష్టమైన ఆరోపణలు చేశారని కూడా గుర్తుచేస్తున్నా అన్నారు రేవంత్. అంతేకాదు, ఇదే అంశమై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించారనీ, ఇలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలంటూ ప్రహ్లాద్ జోషీని ఆయన అడిగారనీ చెప్పారు. ఈ వ్యవహారం మీద రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ స్పందించాలని సూటిగా ప్రశ్నిస్తున్నా అన్నారు రేవంత్ రెడ్డి. రామేశ్వరరావు ఎవరికి శ్రేయోభిలాషో అందరికీ తెలుసనీ, అలాంటి వ్యక్తిని కిషన్ రెడ్డి దగ్గరుండి ఢిల్లీ తీసుకెళ్లి మేలు చేయడాన్ని ఎలా చూడాలో అని సొంత పార్టీ వాళ్లు అడుగుతున్న ప్రశ్నకు ఆయనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో ఇదే లక్ష్మణ్, రాష్ట్ర విద్యుత్ శాఖలో భారీ అవినీతి జరిగిందనీ, కేసీఆర్ ని చీల్చి చెండాడతానంటూ కబుర్లు చెప్పారన్నారు. నెలలు దాటుతున్నా లక్ష్మణ్ ఎందుకు గడపదాటం లేదనీ, కేంద్రానికి కేసీఆర్ మీద ఎందుకు ఒక్క ఫిర్యాదు కూడా చెయ్యలేదని రేవంత్ ప్రశ్నించారు. హోం శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఈ రాష్ట్రంలోనే ఉన్నారు కదా, ఎందుకు కేసీఆర్ మీద విచారణకు ఆదేశించే ప్రయత్నాలు చేయడం లేదు అన్నారు. కేసీఆర్ కి బీ టీమ్ గా ఎవరు పనిచేస్తున్నారో ఎప్పటికప్పుడు స్పష్టమౌతోందంటూ ఆరోపించారు. మరి, దీనిపై భాజపా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.