కాంగ్రెస్ పార్టీలో ఎవరు గెలిచినా ఉంటారో ఉండరో తెలియదు… ఆ పార్టీకి ఓటేయడం ఎందుకు..? అన్నది ఇప్పటి వరకూ జోరుగా జరుగుతున్న ఓ రకమైనచర్చ. ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్పి… కాంగ్రెస్ పార్టీలో గెలిచినా టీఆర్ఎస్లోకే వస్తారని.. అందుకే టీఆర్ఎస్నే గెలిపించాలని ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ ప్రచారం కాంగ్రెస్‌కు చాలా మైనస్ చేసింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత వ్యూహాత్మకంగా ఈ ప్రచారానికి తెరదించేందుకు రాజకీయాలు ప్రారంభించారు. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపుడేనని ఘాటు ప్రకటన చేశారు. దీంతో .. టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోచురుకుపుట్టింది.
వరుసగా మీడియా సమావేశం పెట్టి రేవంత్‌ను దూషించడం ప్రారంభించారు. అయితే రేవంత్ కోరుకున్నది ఈ ఎఫెక్టే. పార్టీ మార్పులపై విస్తృతమైన చర్చ జరగాలని ఆయన కోరుకుంటున్నారు. టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించడంతో ఇక కాంగ్రెస్ నేతలు ఊరుకోలేదు.. సీతక్క సహా అందరూ రంగంలోకి దిగి.. వారిపై ప్రతి విమర్శలు చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలంగా లేనప్పుడు… పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేవారు లేరు.. కనీసం వెళ్తున్న వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో.. టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగడం… సొంత ప్రయోజనాల కోసం వెళ్లేవారి ఇష్టారాజ్యం అయిపోయింది. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడం.. బాధ్యతలు చేపట్టక ముందే ఓ ఊపు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.
ఎమ్మెల్యేల అవసరం లేకపోయినా… కాంగ్రెస్ పార్టీ నేతల్ని.. టీఆర్ఎస్లో చేర్చుకున్న వైనం మెల్లగా రేవంత్ ప్రజల్లో చర్చకు పెడితే.. అది టీఆర్ఎస్కు మరింత మైనస్ అవుతుంది. అందుకే.. పార్టీ మారిన వాళ్ల గురించి ప్రజలే నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిస్తున్నారు. మొత్తానికి రేవంత్.. పీసీసీ చీఫ్‌గా..కాంగ్రెస్‌కు ఉన్నరోగాలన్నింటికీ వీలైనంత వేగంగా మందులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్లు ఎవరూ నోరెత్తకపోయినా.. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.