అధికార పార్టీపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆయన హైదరాబాద్ లో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్ర ఎప్పటికీ మరచిపోలేనేది అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి జీతభత్యాలు ఉంటాయని మాటిచ్చిన సన్నాసి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారంటూ కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని విమర్శిస్తూ… ఆయన తలమాసిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఊసరవెల్లి కూడా ఎర్రబెల్లిని చూసి సిగ్గుపడుతుందనీ, అన్ని రకాల రంగులు ఆయన మారుస్తున్నాడంటూ దయాకర్ రావు ఉద్దేశించి విమర్శించారు. మరో మంత్రి పువ్వాడ అజయ్ ని కూడా రేవంత్ వదల్లేదు.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని ఎర్రబెల్లి వెనకేసుకొస్తున్నారనీ, ఈయన టీడీపీలో ఉండగా… ఆర్టీసీ కార్మికుల పట్ల కసాయివాడిలా వ్యవహరించొద్దనీ ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కేసీఆర్ ని నాడు డిమాండ్ చేసిన మాట మార్చిపోయావా అంటూ రేవంత్ ప్రశ్నించారు. పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి, తలసాని లాంటి సన్నాసుల వల్లనే ఆనాడు ఉద్యమ సమయంలో విద్యార్థులు ఆత్మాహుతి చేసుకోవాల్సి వచ్చిందనీ, ఇప్పుడు మంత్రులుగా ఉంటూ వీరి అసమర్థ విధానాల వల్లనే ఇంటర్ విద్యార్థులు చనిపోయారని రేవంత్ విమర్శించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ… గతంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశావ్ కదా, సెల్ఫ్ డిస్మిస్ అనేది ఎక్కడైనా ఉంటుందా, ఒకవేళ మందేసి ఇలాంటి మాటలు మాట్లాడినా తరువాత అధికారులతో చర్చించి నిజాలు తెలుసుకోవాలి కదా అంటూ మండిపడ్డారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి, సమ్మె నోటీసు ఇచ్చిన దగ్గర్నుంచే ప్రభుత్వం నుంచి కొంత సానుకూల దృక్పథంతో చర్యలకు దిగి ఉంటే ఈ పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది. అప్పుడేమో మొండి వైఖరి అవలంభించి, ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా ఆర్టీసీ కార్మికుల్ని విమర్శించారు. విలీనం చేస్తామని ఎక్కడా అనలేదని ఎర్రబెల్లి అంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా, కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఎందుకు చెయ్యలేకపోయారంటూ మరో మంత్రి తలసాని మాట్లాడారు! వీటన్నింటినీ పర్ఫెక్ట్ గా తిప్పి కొట్టారు రేవంత్ రెడ్డి. రేవంత్ వ్యాఖ్యలపై ఆ ముగ్గురు మంత్రులు స్పందించే పరిస్థితి ఉంటుందా..?