కేసీఆర్ సర్కారు పనితీరును ఆయన నియమించుకున్న ప్రధాన కార్యదర్శే బయటపెట్టారనీ, 20 శాఖలు గ్రేడిండ్ చేసి మార్కులు ఇచ్చిన ర్యాంకింగుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లు దారుణంగా ఫెయిల్ అయ్యారంటూ ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయన ఇచ్చిన మార్కుల ప్రకారమే… కేసీఆర్ మానస పుత్రిక సాగునీటి పారుదల శాఖకు 8వ ర్యాంకు వచ్చిందన్నారు. మరో మానస పుత్రిక విద్యుత్ శాఖకు 11వ ర్యాంకు దక్కిందని చెప్పారు. కేటీఆర్ దత్త పుత్ర శాఖకు 18వ ర్యాంకు వచ్చిందన్నారు. తండ్రీ కొడుకులు నిర్వహించిన శాఖన్నీ ఫెయిలయ్యాయన్నారు. ఇదే సమయంలో టీవీ9 ప్రతినిధి మాట్లాడుతూ, ర్యాంకుల సంఖ్య ఎలా ఉన్నా, వచ్చిన మార్కుల్ని చూడాలి కదా అని రేవంత్ ని ప్రశ్నిస్తే… టీవీ9కి కేసీఆర్ కి నంబర్ వన్, కేటీఆర్ కి కేడీ నంబర్ వన్ ర్యాంకు ఇద్దామని ఉంటే ఇచ్చుకోవచ్చని ఎద్దేవా చేశారు. టీవీ9 యజమాని రామేశ్వరరావుకి మేమేం చెప్పినా ఇష్టం ఉండదన్నారు.
8, 11, 18 ర్యాంకులు వచ్చిన శాఖల్ని నిర్వహిస్తున్న తండ్రీ కొడుకులు తెలంగాణ సమాజానికి పట్టిన చీడపురుగులు అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషీ నివేదిక ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు కలిసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించారని చెప్పి ఈ నివేదిక ద్వారా అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి అంతా మేడి పండు లాంటిందన్నారు. మొన్ననే కేసీఆర్ మాట్లాడుతూ… న్యూయార్క్ సెంటర్లో కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధిని ప్రదర్శిస్తున్నారనీ, కాంగ్రెసోళ్ల కళ్లకు కనిపిస్తలేవా అని విమర్శించారని రేవంత్ గుర్తుచేశారు. ప్రజలను ఎంత చక్కగా కేసీఆర్ మభ్యపెడుతున్నారనడానికి మరో ఉదాహరణ అన్నారు. తెలంగాణలో వేల కోట్లు దోచుకుంటున్న మెగా ఇంజినీరింగ్ సంస్థ న్యూయార్క్ లో ఒక హోర్డింగ్ పెట్టుకున్నారన్నారు. తెలంగాణను నిండా ముంచాక న్యూయార్క్ లో ఏందీ, చంద్ర మండలంలో కూడా ప్రకటనలు పెట్టిస్తారని ఎద్దేవా చేశారు. న్యూయార్క్ లో ప్రకటన ఇచ్చింది ఏ ప్రభుత్వ శాఖ ఇచ్చింది కాదనీ, దాన్ని తీసుకొచ్చి మా గొప్పతనమని కేసీఆర్ చెప్తున్నారని రేవంత్ విమర్శించారు.
తెలంగాణలో యాభై శాతం ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన శాఖ కూడా 20వ ర్యాంకులో ఉందన్నారు. అంటే, ఈ రాష్ట్రంలో సంక్షేమమే లేదని ప్రభుత్వమే చెప్పుకున్నట్టైందన్నారు. మొత్తానికి, రేవంత్ కి దొరికిన ఈ ర్యాంకుల పట్టికతో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. టాప్ 3 ప్లేసుల్లో కేసీఆర్, కేటీఆర్ నిర్వహించిన శాఖలేవీ లేవు! మార్కుల పరంగా చూసుకుంటే మంచి నంబర్లే ఉన్నా కూడా… ఎక్కడైనా మొదటి మూడు స్థానాలే టాప్ ర్యాంకులనీ, మిగతావన్నీ ఫెయిలైనట్టేనని రేవంత్ అంటున్నారు. ఏదేమైనా, టాప్ త్రీ ప్లేసుల్లో వారి శాఖలు లేకపోవడం… అదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదికలో బహిర్గతం కావడం విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్టే.