కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను అరెస్టు చేయకుండా బీజేపీ అడ్డుపడుతోందని రేవంత్ రెడ్డి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. అమెరికాలో ఇద్దరు దాక్కున్నారని వారిని తీసుకు వచ్చేందుకు బీజేపీ సహకరించటం లేదన్నారు.. వారిని తీసుకు వచ్చిన 48 గంటల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను అరెస్టు చేస్తామన్నారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అరెస్టులకు ఎవరో అడ్డుపడుతున్నారని చెప్పడం నమ్మశక్యంగా ఉండదు. ఎందుకంటే కేటీఆర్ ను అరెస్టు చేయడానికి ఒక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కాదు.. చేతిలో బ్రహ్మాస్త్రంలా ఫార్ములా ఈ రేసు వ్యవహారం ఉంది.
ఈ కేసులో సుప్రీంకోర్టులోనూ కటీఆర్ కు ఊరట లభించలేదు. అరెస్టు చేయాలనుకుంటే ఇప్పటికిప్పుడు అరెస్టు చేయవచ్చు. కేటీఆర్ కు ఎలాంటి న్యాయపరమైన అవకాశాలు కూడా మిగల్లేదు. అయినా అరెస్టు చేయకుండా బీజేపీ అడ్డు పడుతోందని రేవంత్ వ్యాఖ్యానించడం కాస్త అతిశయోక్తిగానే ఉంది. బీజేపీ , బీఆర్ఎస్ ఒకటే అని ప్రచారం చేయడానికి రేవంత్ బలమైన పాయింట్లే ఎంచుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయని బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను ఓడించమని ప్రచారం చేస్తోందని అంటే ఎవరికి ఓటేయాలని చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ కోసమే బీఆర్ఎస్ ఎన్నికల బరిలో నిలబడలేదని ఎక్కువ మంది నమ్మే విషయం. దీన్ని రేవంత్ బ లంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు కానీ.. ఇలా వారిని అరెస్టు చేయకుండా బీజేపీ కాపాడుతోందని కారణం చెప్పడం మాత్రం ఎబ్బెట్టుగానే ఉంటుంది. అరెస్టుల ద్వారా అనవసర మైలేజీలు ఇవ్వడం ఎందుకని రేవంత్ అనుకుంటున్నారేమో కానీ.. ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. గతంలో హింట్ ఇచ్చారు కానీ.. తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అరెస్టుల గురించి రేవంతే ప్రస్తావించారు. మరి బీజేపీ నేతలు ఊరుకుంటారా?