కులగణన అనేది రాహుల్ టాస్క్. దాన్ని రేవంత్ రెడ్డి పక్కాగా అమలు చేయాలనుకుంటున్నారు. ప్రతిఫలం ఎలా ఉంటుందన్నది ఆయన చూసుకోలేదు. రాహుల్ చెప్పారు కాబట్టిచేస్తున్నారు. అలాగే.. దాన్ని వ్యతిరేకించే వారిపైనా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేరుగా మోదీని టార్గెట్ చేయడం కాస్త కలకలం రేపుతోంది. మోదీ కులాన్ని హైలెట్ చేస్తూ.. ప్రసంగించడంతో బీజేపీ నేతలు కూడా భగ్గుమంటున్నారు.
మోదీ బీసీ హోదాపై రేవంత్ విమర్శలు
బీసీల రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ అసలైన బీసీ కాదన్నారు. ఆయన అసలు ఉన్నత వర్గానికి చెందిన వారు అని.. మోదీ సీఎం అయిన తర్వాతనే తన సామాజికవర్గాన్ని బీసీల్లో కలుపుకున్నారని చెప్పారు. లీగల్లీ కన్వర్టడ్ బీసీ అనే పదం వాడారు. ప్రధాని మోదీ బీసీనా హసీనా అన్నది ఎప్పుడూ చర్చనీయాంశం కాలేదు. భారతీయ జనతా పార్టీ ఆయనను బీసీ లీడర్ గా ప్రొజెక్ట్ చేయలేదు. అయితే తమ పార్టీ నేత బీసీ అని మాత్రం ప్రచారం చేసుకుంటారు. కానీ ఇక్కడ రాహుల్ మోదీ సామాజికవర్గాన్నే ప్రశ్నించారు. సహజంగా ఇది బీజేపీ నేతల్ని రెచ్చగొట్టినట్లవుతుంది.
సీటు పోయే కాలం దగ్గర పడిందన్న బీజేపీ
ప్రధాని మోదీని వ్యక్తిగతంగా తిట్టినవారంతా ఏమైపోయారో కాలం చూపించిందని రేవంత్ రెడ్డికి కూడా సమయం దగ్గర పడినట్లుగా ఉందని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలోఉన్న వారు అలా మాట్లాడకూడదని.. చాలా పెద్ద తప్పు చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అదే సమయంలో రాహుల్ కులాన్ని తెరపైకి తెచ్చారు రఘునందన్ రావు. మోదీ సామాజికవర్గం గురించి రేవంత్ కు కొత్తగా తెలుసేమో కానీ అది ముందుగా అందరికీ తెలుసని..అసలు రాహుల్ కులమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ సామాజికవర్గం ఏదంటే ఏం చెబుతారు?
మోదీ లీగల్లీ కన్వర్టడ్ బీసీ అంటున్నారని మరి రాహుల్ కులమేంటి అని వస్తున్న ప్రశ్నలకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థాయి నేతలకు కులాన్ని ఆపాదించలేరు కానీ.. రేవంత్ మోదీ టార్గెట్ గా చేసిన విమర్శలతో స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అసలు తెలంగాణ కులగణనకు..మోదీ కులానికి సంబంధం ఏముందని రేవంత్ ఆవేశపడ్డారో..ఆయనకే తెలియాలన్న నిట్టూర్పు కాంగ్రెస్లో వినిపిస్తోంది.