కేసీఆర్ అసలే పట్టించుకోవడం లేదని.. ఆపద్ధర్మ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి బాథపడుతూంటే.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆయన అన్న మాటలను పట్టుకుని.. ఏకంగా కేసీఆర్ నే ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ముషీరాబాద్ టిక్కెట్ ను.. తన అల్లుడికి లేదా.. తనకు ఇవ్వాలని నాయిని పట్టుబడుతున్నారు. అయితే తన వాదన వినిపించుకోవడానికి కూడా నాయినికి అవకాశం దొరకడం లేదు. దీంతో ఓ కార్యక్రమంలో మీడియాలో మాట్లాడిన ఆయన… ఓపెన్ అయిపోయారు. నెల రోజుల నుంచి తనకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని బాధపడ్డారు. అంతేనా గత ఎన్నికల అనుభవాలను కూడా చెప్పుకొచ్చారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే.. రూ. 10 కోట్లు ఇస్తానన్నారని… గుర్తు చేసుకున్నారు.
ఈ పాయింట్ ను రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుకున్నారు. నాయిని నర్సింహారెరెడ్డి మాట్లాడిన మాటల సీడీలు, పేపర్ క్లిప్పింగులు ప్టటుకుని రేవంత్ రెడ్డి నేరుగా.. ఈసీ దగ్గరకు వెళ్లిపోయారు. సీఈవో రజత్‌కుమార్‌ను కలిసి నాయిని వ్యాఖ్యల ఆధారంగా కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే రూ. 10 కోట్లు ఇస్తానని.. చెప్పానని.. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో లెక్కలు తేల్చాలని కోరారు. అసలు పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే.. తన మాటలను పట్టుకుని రేవంత్ రెడ్డి ఈసీ వరకూ వెళ్లడం… విమర్శలు ప్రారంభించడంతో.. నాయిని నరసింహారెడ్డికి ఇబ్బందికరంగా మారింది. అందుకే మళ్లీ ప్రెస్ మీట్ పెట్టారు. గత ఎన్నికల సందర్భంగా తెరాస అధినేత, సీఎం కేసీఆర్ రూ.5 లేదా 10 లక్షలు ఇస్తారన్నారని చెప్పబోయి పొరపాటున రూ.10 కోట్లు అన్నానని కవర్ చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలను తోసి పుచ్చారు. రేవంత్ రెడ్డిని చిల్లర మనిషని వ్యాఖ్యానించి తన కోపం తీర్చుకునే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ లో చేరడం కానీ.. స్వతంత్రంగా పోటీ చేయడం కాని ఉండదని చెబుతున్న నాయిని కేసీఆర్ ను మంచి చేసుకునే ప్రయత్నాలే చేశారు. ముషీరాబాద్ విషయంలో సీఎం కేసీఆర్ ఆదేశాలను శిరసావహిస్తామన్నారు. కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నది వాస్తవం కాదని.. ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నానని కవర్ చేసుకున్నారు. మొత్తానికి నిన్నమొన్నటి వరకూ… కేసీఆర్ సర్కార్ లో హోంమంత్రిగా… కీలకంగా వ్యవహరించిన నాయినికి ఇప్పుడు… ఎక్కడ లేని తిప్పలు వచ్చి పడ్డాయి. ఓ వైపు కేసీఆర్ నిరాదరణ చూపిస్తూంటే.. తన వ్యాఖ్యలు పట్టుకుని రేవంత్ మరింత రచ్చ చేస్తూండటం ఆయనను చిక్కుల్లోకి నెడుతోంది.