తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి … అవినీతిపై కేసులు , అరెస్టులు అనే అంశాల కన్నా ముందు ప్రజల ముందు నిజాలు ఉంచాలనుకుంటున్నారు. గత ప్రభుత్వం దాచి పెట్టిన వివరాలన్నింటినీ ప్రజల ముందు పెట్టాలలనుకుంటున్నారు. ఇప్పటికే 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన నిధుల కేటాయింపు, విద్యుత్ శాఖలోని రూ. 85 వేల కోట్ల అప్పుల గురించి బయటకు వెల్లడించారు. దీనిపై శాసనసభ సమావేశాల్లో పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవ పరిస్థితి చెప్పాలని అనుకుంటున్నారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చిదిమేశారని.. అందుకే ఆ విషయంలోనూ ప్రజల ముందు పూర్తి వివరాలు ఉంచాలనుకుంటున్నారు. ప్రజలు కట్టే పన్నులు, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా వినియోగించిందనే విషయమాన్ని వెల్లడించనున్నారు. ఉచిత విద్యుత్ విషయంలోనూ వివరాలు కావాలనీ, నివేదిక ఇవ్వాలని ఇప్పటికే విద్యుత్ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సునీల్‌శర్మను ఆదేశించారు.
ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ముందుకెళ్లి ఆభాసుపాలయ్యే కంటే, ఆచితూచి అడుగులేస్తూ అవినీతిని బయటపెట్టాలనుకుంటున్నారు. విద్యుత్ వ్యవహారంలో సమీక్ష సమావేశానికి ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పిలిచినా రాలేదు. తనను పిలవలేదంటున్నారు. కేసీఆర్‌ను ఆసరాగా చూసుకుని, ప్రభాకర్‌రావు గతంలో ఆర్థిక శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారితో విభేదించి, ఆయన్ను టార్గెట్ చేశారనే ప్రచారమూ ఉంది.
బీఆర్ఎస్ పతనానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక కారణం. కాగ్ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1.26 లక్షల కోట్లు ఖర్చుపెట్టారు. అయినా పనులు నాణ్యంగా జరగలేదు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటే ఇందుకు నిదర్శనం. దీనికోసం ఖర్చుపెట్టిన వ్యయంలో కనీసం 30 నుంచి 40 శాతం నిధులు అవినీతేనని భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిపై ప్రతికారంతో కాకుండా విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే కోణంలో నిజాలను ప్రజల ముందు ఉంచనున్నారు.