బీఆర్ఎస్ పార్టీ తనపై రాజకీయ దాడి ఉద్ధృతం చేసినా రేవంత్ రెడ్డి మాత్రం చేరికల మిషన్ ను ఓ రేంజ్ లో పూర్తి చేస్తున్నారు. తాజాగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని హస్తం గూటికి చేరుస్తున్నారు. ఆయన కోడలు జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. అయినా పార్టీ మారుతున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎ్‌సలోకి రావడంతో వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ దక్కదని కృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తీగలను చేర్చుకునేందుకు రేవంత్ సంప్రదింపులు జరిపారు.
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు భార్య భువనేశ్వరి, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్‌రెడ్డి తదితరులు ఖర్గే సమక్షంలో గురువారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. బుధవారం ఉదయం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో రేవంత్, ఠాక్రే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యులు, ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. చేరికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అనంతరం ఠాక్రే, రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
మరో వైపు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ప్రయారిటీగా తీసుకుని వివాదం చేయడంపై కాంగ్రెస్ లోనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు మద్దతిచ్చేలా కొంత మంది కాంగ్రెస్ నేతలు మాట్లాడిన అంశమూ హాట్ టాపిక్ అయింది. ఇదంతా హైకమాండ్ దృష్టిలో ఉందని… పార్టీకి నష్టంచేసే వారిని సహించబోరని అంటున్నారు.