తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి… దూకుడైన నాయకుడు. ఆ దూకుడే ఆయనకు అనేక చిక్కులు తెచ్చి పెట్టినా.. దాన్ని మాత్రం వదలుకోరు. తెలంగాణలో మాటలతో కేసీఆర్‌ను ఎదుర్కోగల ఏకైక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో రేవంత్.. మీడియాకు ఇంటర్యూలు ఇస్తూ.. మరింతగా… రాజకీయ మంట రాజేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో వెలమల పాత్ర చాలా స్వల్పమని.. వారితో .. రెడ్లకు పోటీ ఏమిటని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఓ బస్తా బియ్యంతో అన్నం చేస్తే.. వెలమలకు పెట్టగా మిగిలిపోతుదని.. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో వ్యాఖ్యానించారు. అంతే కాదు.. వెంటనే రెడ్డి సామాజికవర్గానికి సర్టిఫికెట్ ఇచ్చారు. దేశం కోసం యుద్ధం చేయగలిగినంత మంది రెడ్లు ఉన్నారంటున్నారు. అలాంటిది.. రెడ్లు, వెలమలకు మధ్య పోటీ ఏమిటని… రేవంత్ తెలివిగా ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ ను తిట్టి పెద్ద నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారా.. అన్న ప్రశ్నలకు కూడా.. తనదైన మార్క్ సమాధానాలిస్తున్నారు. అసలు కేసీఆర్ ఏ విధంగా పెద్దవాడో చెప్పాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను పెద్దవాడు అని ఎందుకు అంటున్నారంటే.. ఆయన కూర్చున్న కుర్చీ వల్ల అని.. అది లేకపోతే.. ఎలా పెద్దవాడవుతారని ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో గజ్వేల్ లో కేసీఆర్ కు వచ్చిన మెజార్టీ కంటే.. తనకే ఎక్కువ వచ్చిందని.. తాను ఇండి పెండెంట్గా కూడా గెలిచానని.. కానీ కేసీఆర్ కు ఆ చరిత్ర లేదని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ను చాలా తేలికగా తీసి పడేయడంలో… రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మీడియా ఇంటర్యూల్లోనే అదే ఫీలింగ్ వచ్చేలా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి.. తెలంగాణ జనాభాలో ఒకటి, ఒకటిన్నర శాతం కూడా…లేని వెలమలు.. రెడ్డి సామాజికవర్గాన్ని తీవ్రంగా అణచి వేస్తున్నారని గతంలో నేరుగానే ఆరోపణలు చేశారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో 90 శాతం రెడ్డి సామాజికవర్గం చేతుల్లో ఉన్నాయని.. ఫీజు రీఎంబర్స్ మెంట్లను ఆపేశారని ఆరోపించారు. ఆ తర్వాత వెలమ, రెడ్డి అంశాలకు సంబంధించి ఏదైనా టాపిక్ వస్తే అగ్రెసివ్‌గా స్పందిస్తూ వస్తున్నారు. గతంలో కేసీఆర్ సన్నిహితులైన దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్లు టీవీల్లో రెడ్లను కించ పరుస్తూ మాట్లాడిన మాటలను.. ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తున్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రెడ్లకు ఎదురైన కష్టాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారు. ఓ రకంగా.. రెడ్డి సామాజికవర్గాన్ని కేసీఆర్ దారుణంగా వంచిస్తున్నారన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. కుల రాజకీయాలు చేస్తున్నారని.. కేసీఆర్‌కు కులం ఆపాదిస్తున్నారని.. ఎవరైనా విమర్శిస్తే… అంతే గడుసుగా సమాధానం చెబుతున్నారు. రెడ్లను టార్గెట్ చేసి.. వెలమ వర్సెస్ రెడ్డి అనే పరిస్థితిని కేసీఆర్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. అసలు రెడ్లతో.. వెలమలు ఎలా పోటీ పడతారని లాజిక్ తీస్తున్నారు. కొద్ది రోజుల క్రితం.. రేవంత్ పై ఫిర్యాదు చేసిన రామారావు అనే లాయర్… రేవంత్ రెడ్డి వెలమలను తిట్టడం వల్లే… కక్ష తీర్చుకున్నానని మీడియాకు ఎక్కి చెప్పారు. అప్పట్నుంచి.. దీన్ని రేవంత్ రెడ్డి మరింత ప్లాన్డ్ గా ఉపయోగించుకుటున్నారు. రెడ్డి సామాజికవర్గాన్ని తన మాటలతోనే ఏకం చేస్తున్నారు. ఇందుకోసం .. కేసీఆర్ ను సాఫ్ట్ టార్గెట్ గా మార్చుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.