రేవంత్ రెడ్డికి వ్రతంచెడినా ఫలితం దక్కింది., వరివేస్తే ఉరే అని తెలంగాణ సర్కార్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కేసీఆర్ ఫామ్ హౌస్‌లో వరి పండిస్తున్న ఫోటోలను బయటకు తీసుకు వచ్చారు. వాటిని చూపించి… రైతులకు వరి వేయవద్దని చెబుతున్న కేసీఆర్ … తన ఫామ్‌హౌస్‌లో ఎందుకు పండిస్తున్నారని ప్రశ్నించారు. ఇది టీఆర్ఎస్ వర్గాలకు ఒకింతషాక్ లాంటిదే్. వెంటనే రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ఎర్రవెల్లిలో రచ్చబండ బెట్టి తెలంగాణ మొత్తం చాటింపు వేయాలనుకున్నారు. కానీ పోలీసులు హౌస్ అరెస్టులు చేయడంతో ఎర్రవెల్లికి వెళ్లలేకపోయారు.
కానీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రం అవును.. కేసీఆర్ వరి పంట వేశారు.. అయితే ఏంటి అని ఎదురుదాడికి దిగారు. ఆయన రైతు కాబట్టి వరి పంట వేశారని.. రేవంత్ రెడ్డికి భూమి ఉంటే ఆయన కూడా వరి వేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ భరోసా లేకుండా వరి పంట ఎవరైనా వేసుకోవచ్చన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తాను పండించే పంటను ఎవరికి అమ్ముతారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వడ్లు కొన్న వాళ్లు… రైతుల వడ్లు కొనరా? అని అడిగారు. రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు టీఆరెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర్లో ఉన్నాయని విమర్శించారు. బీజేపీ, టీఆరెస్ నేతల వైఖరి వల్లనే నేడు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను రాజులు చేస్తామని వ్యాఖ్యానించారు.
యాసంగి లో వడ్లు పండించండి.. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి అయిన సరే కొనుగోలు చేయిస్తామన్నారు. మొత్తంగా కేసీఆర్ వరి పంట విషయం తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. అందరికీ వద్దనిచెబుతున్న కేసీఆర్ స్వయంగా వరి పంట వేశారని అంగీకరించడం వల్ల… మరింత మంది రైతులు తాము మాత్రం ఎందుకు పంట మార్పిడి చేసుకోవాలని.. అదే పంట వేసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా రేవంత్ రెడ్డి రచ్చబండ నిర్వహించకపోయినా కేసీఆర్‌తో వరి పంట వేయించామన్న సంగతిని అంగీకరించేలా చేయగలిగారు.