వాస్తు కారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడేళ్లుగా సచివాలయానికి వెళ్లడం లేదని.. ఆయన నాన్ వర్కింగ్ సీఎం అంటూ రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు విమర్శలు చేశారు. వాస్తు కారణంగానే కొన్ని వందల కోట్లు దుబారా చేసి.. కొత్త సచివాలయం కడుతున్నారని కూడా ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఆయన కూడా వాస్తుబాటలోకే వెళ్లారు. పీసీసీ చీఫ్‌గా హైకమాండ్ నియమించిన వెంటనే.. రేవంత్ రెడ్డి సీనియర్లను బుజ్జగించడమే కాదు … వాస్తుపై కూడా దృష్టి పెట్టారు. గాంధీ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. గాంధీభవన్ తూర్పు వైపు మరో ద్వారం ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుత పీసీసీ చీఫ్ ఛాంబర్ తూర్పులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకు ముందు గాంధీ భవన్లో ప్రచార సామాగ్రి అమ్మే గది ఉండేది. దాన్ని తొలగిస్తున్నారు. సెక్యూరిటీ రూమ్ గదిని కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏడో తేదీన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆ రోజుకల్లా పనులు పూర్తి చేయాలని రేయింబవళ్లు పనులు చేయిస్తున్నారు. గాంధీ భవన్ ఇప్పటికే రేవంత్ అనుచరుల హవాలో ఉంది. మొత్తం వారే దగ్గరుండి .. వ్యవహారాలు చూసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి తెలియకుండా.. వాస్తు మార్పులు జరుగుతాయని ఎవరూ అనుకోవడం లేదు.
రాజకీయ నేతలు.. సినీ తారలకు నమ్మకాలు ఎక్కువ. వాస్తు పరంగా.. సంఖ్యా శాస్త్ర పరంగా కూడా.. అదృష్టాన్నీ పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే కేసీఆర్ వాస్తు నమ్మకాన్ని ఎగతాళి చేసే రేవంత్ రెడ్డి.. తాను ఎక్కువగానే వాస్తును నమ్ముతారని ఎవరూ అనుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకైనా మంచిదన్నట్లుగా గాంధీభవన్‌కు వాస్తు మార్పులు చేపిస్తూ ఆశ్చర్య పరుస్తున్నారు. ఈ మార్పులు.. కాంగ్రెస్‌కు మంచి రోజులు తీసుకు వస్తే.. అవి రేవంత్ తీసుకు వచ్చినట్లే.