గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత తెలంగాణాలో తెదేపా, భాజపాలు దూరం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అవి శాస్త్రోక్తంగా ఇంకా విడిపోలేదు కానీ ఆ ప్రక్రియని మెల్లగా ప్రారంభించినట్లే ఉన్నాయి. “తెలంగాణాలో తెదేపా బలహీనపడింది…వచ్చే ఎన్నికలలో భాజపా ఒంటరిగా పోటీ చేస్తుంది..” అని తెలంగాణా భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్ చేసిన చిన్న ప్రకటన భాజపా నుంచి ఇచ్చిన మొదటి సంకేతంగా భావించవచ్చు.
తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా తెగతెంపుల ప్రక్రియని ముందుకు తీసుకు వెళుతూ రాష్ట్ర భాజపాపై, కేంద్రంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. అంతే కాదు భాజపాకి అనుబంధ సంఘంగా పనిచేసే ఏ.బి.వి.పి.కి చెందిన కొందరు నేతలు, విద్యార్ధులని నిన్న తెదేపాలో చేర్చుకొని భాజపాకి మొదటి షాక్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్, భాజపాలు తెరాసకి తోకపార్టీలుగా మారాయి. కేంద్రప్రభుత్వం కూడా తెరాసకి, కెసిఆర్ కి వంతపాడుతోంది. అసలు సచివాలయానికే ఎన్నడూ రాని ముఖ్యమంత్రి కెసిఆర్ కి దేశంలో నెంబర్:1 ముఖ్యమంత్రి అని కేంద్రం ఏవిధంగా ర్యాంక్ ఇచ్చిందో తెలియదు.వారు ఏ ప్రాతిపదికన ఆయనకి నెంబర్:1 ర్యాంక్ ఇచ్చారో చెప్పాలి,” అని విమర్శించారు.
రాష్ట్రంలో తెదేపా,భాజపాలు దూరం అయిన తరువాత భాజపాని, మోడీ ప్రభుత్వాన్ని పేరుపెట్టి తెదేపా విమర్శించడం ఇదే మొదటిసారి. దీనిని భాజపా రాష్ట్ర స్థాయి వ్యవహరంగానే భావించి, రాష్ట్ర భాజపా నేతల చేతే రేవంత్ రెడ్డికి జవాబు చెప్పిస్తుందా లేకపోతే దానిని ఆంధ్రప్రదేశ్ కి విస్తరింపజేస్తుందా? అనేది క్రమంగా బయటపడవచ్చు.