ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీజేపీ నేతల్ని కేసీఆర్ ఇరికించిన ఫామ్ హౌస్ కేసును రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బయటకు తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ నలుగురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో చిరుమర్తి లింగయ్య తనకు అనారోగ్యమని చెప్పి డుమ్మాకొట్టారు. కానీ ఇవాళ కాకపోతే రేపు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. మిగిలిన వారినీ ప్రశ్నించనున్నారు. వారు ఫామ్ హౌస్ కేసులో ఫీల్డ్ లో ఉన్న నలుగురు మాజీ ఎమ్మెల్యేలే.
ఫామ్ హౌస్ కేసు సీబీఐకి వెళ్లింది. ఆ కేసు విచారణ మాత్రం సీబీఐ చేయడం లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. సీబీఐ విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. కానీ విచారణ వద్దన్నట్లుగా ఆదేశాలిచ్చింది. దాంతో సీబీఐ సైలెంట్ అయిపోయింది. అది కేవలం ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు. ట్యాపింగ్ వరకూ రాలేదు. ఇప్పుడు రేవంత్ ట్యాపింగ్ కోణంలో ఆ కేసును వెలుగులోకి తెస్తున్నారు. ఆ కేసు మొదట ట్యాపింగ్‌తో ప్రారంభమయిందని బీఆర్ఎస్ లో గుసగుసలు ఉన్నాయి.
ట్యాపింగ్ చేసి దొరికిపోయిన పోలీసులు కూడా అదే స్టేట్ మెంట్ ఇచ్చారు. ట్యాపింగ్ చేస్తున్న సమయంలో బీజేపీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల గురించి తెలిసిందని వారిని ట్రాప్ చేసి.. బీజేపీ పెద్దల్ని ఇరికించేందుకు కేసీఆర్ కుట్ర ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ అధికారికంగా చాలా కీలకమైన డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. అవి ట్యాపింగ్ చేసి సేకరించినవేనని అంటున్నారు. ఈ క్రమంలో ఈ నలుగురు ఎమ్మెల్యేల విచారణ తర్వాత వేరే కోణంలో ఫామ్ హౌస్ కేసు వెలుగులోకి రానుంది.
దీన్ని ఇప్పుడు బయటకు తీసుకు రావడం వెనుక రేవంత్ వ్యూహాత్మక ప్రయత్నాలు ఉన్నాయని అంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ లపై చర్యలు తీసుకోకుండా బీజేపీ అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో కేసీఆర్, కేటీఆర్ ఎంత ప్రమాదకర వ్యక్తులో గుర్తు చేయాలని అనుకుంటున్నారని బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక విమానంలో పోలీసుల్ని పంపారనే సంగతిని మర్చిపోవద్దని రేవంత్ గుర్తు చేయబోతున్నారని అనుకోవచ్చు.