తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించారు. అయితే ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కక్ష సాధింపు అని అనిపింకుండా.. కవితనే విచారణకు డిమాండ్ చేసినట్లగా క్రియేట్ చేసి.. కవిత కోరినట్లుగా విచారణకు ఆదేశిస్తున్నామని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గతుక్కుమనాల్సి వచ్చింది. శాసనమండలిలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. అందరికీ మేడిగడ్డ చూపిస్తానని.. అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రత్యేక బస్సుల్లో వెళదామని ప్రకటించారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అదేమీ టూరిస్ట్ స్పాట్ కాదని… ఏమైనా లోపాలుంటే విచారణ చేయించాలని కానీ ప్రాజెక్టను బద్నాం చేయడం కరెక్ట్ కాదన్నారు.
దీనిపై స్పందించిన రేవంత్.. కవిత విజ్ఞప్తి మేరకు.. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించారు. కవిత చెప్పింది.. మేడిగడ్డ కుంగుబాటుపై నిపుణులను తీసుకెళ్లి ఎందుకు కుంగిందో విచారణ చేయించాలని మాత్రమే. కానీ రేవంత్ రెడ్డి దీన్ని విస్తృతార్థంలో తీసుకుని మొత్తం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించారు.
కాళేశ్వరం లో అవినీతి మొత్తాన్ని బయటకు కక్కించి.. ఆ డబ్బులను ప్రజలకు పంచుతామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే కక్ష సాధింపుల లా కాకుండా..ఇలా కవితను ఇరికిస్తూ.. విచారణకు ఆదేశించడం.. రేవంత్ రెడ్డి పక్కా రాజకీయ వ్యూహమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.