తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పదేళ్ల తర్వాత రాక రాక అధికారం వచ్చింది. ఏడాదిన్నర అవుతోంది. కానీ ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో కాదు కదా ఓ మాదిరిగా కూడా పదవులను పంచలేకపోయారు. అనేక మంది మంత్రి పదవుల దగ్గర నుంచి కనీసం పార్టీ పదవులనైనా ఇవ్వాలని కిందా మీదా పడుతున్నారు. కానీ కసరత్తుల మీద కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్.. రేవంత్ ను ఓ ఇరవై సార్లు ఢిల్లీ పిలిపించుకుని ఉంటుంది. కానీ ఏమీ తేల్చలేదు. ఇప్పుడు ఉగాదికి అంటున్నారు. అవుతుందా అంటే.. చెప్పడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.
పదవుల భర్తీ తేల్చరు కానీ పదే పదే ఢిల్లీకి రావాలని పిలుపులు
రేవంత్ తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతల్ని కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి రావాలని పిలిచారు. ఆయన అక్కడ కొంత సేపు వెయిట్ చేయించుకుని వారితో సమావేశం అయ్యారు. ఓ ముఖ్యమంత్రిని వెయిట్ చేయించడం ద్వారా .. వారి చర్యల్ని నియంత్రించడం ద్వారా వేణుగోపాల్ తానే పెద్ద పొజిషన్ లో ఉన్నానని అనుకుంటారేమో కానీ.. ఢిల్లీకి రావాలని ఓ ముఖ్యమంత్రికి ఆయన వద్ద నుంచి వచ్చే మెసెజ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫోన్ లో కమ్యూనికేట్ చేయగలిగేవాటికి కూడా ఢిల్లీకి రావాలంటారు.
రేవంత్ ను బలహీనం చేసేలా ప్రతి అడుగు
కాంగ్రెస్ హైకమాండ్ ప్రతి అడుగు.. రేవంత్ రెడ్డి పార్టీపై పట్టుకోల్పోయేలా చేసేలా ఉంటుంది. నిజానికి ఆయనకు మద్దతు ఇస్తే.. పార్టీ మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చేవారు. బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకునేవారు. కానీ ఆయనకే పెద్దగా సపోర్టు లేదన్న అభిప్రాయాన్ని ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్యేలు ఆగిపోయారు. రేవంత్ ను కలిస్తే పెద్దగా ఏమీ రాదని.. ఢిల్లీ పెద్దల్ని కలిస్తే పదవులు వస్తాయన్న అభిప్రాయాన్ని కల్పించారు. ఇది రేవంత్ ను బలహీనం చేసినట్లే. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఊపందుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే పదవులు రాని వారు చేసే రచ్చ ఎంత డ్యామేజ్ చేస్తుందో చెప్పడం కష్టం.
కాంగ్రెస్కు హైకమాండే మైనస్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ పెద్దలు విశ్లేషణ చేసుకుంటే ఇలాంటి తప్పు చేయరన్న అభిప్రాయం ఉంది. ఉపఎన్నికల్లో డిపాజిట్లు కూడా రానంత ఘోరమైన పరిస్థితుల నుంచి.. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ అసలు హోప్సే లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పుంజుకుంది. మిరకిల్ చేసింది. దానికి హైకమాండ్ పాత్ర ఎంత ఉందో.. రాష్ట్ర నేతల పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు. అందుకే నాయకత్వంపై హైకమాండ్ నమ్మకం ఉంచితేనే.. పార్టీ పటిష్టంగా ఉంటుంది. లేకపోతే కంట్రోల్ ఉండదు. కానీ భిన్నంగా కాంగ్రెస్ హైకమాండ్ వెళ్తోంది.