కొన్ని పార్టీలపై పడిన కొన్ని ముద్రలు అలానే ఉండిపోతాయి! ఆ ఇమేజ్‌లను మార్చుకోవడం అనుకున్నంత తేలిక కాదు. తెలుగుదేశం పార్టీది రెండు కళ్ల సిద్ధాంతమనీ, రెండు నాలుకల ధోరణి అనీ ఎప్పట్నుంచో ఆ విమర్శ వినిపిస్తూనే ఉంది. అయితే, దాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకునేట్టుగానే తెలుగుదేశం తీరు ఉంటోంది! తాజాగా తెలంగాణ అసెంబ్లీ నుంచి రేవంత్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డారనే నెపంతో అధికార పార్టీ తెరాస ఆయన్ని బయటకి పంపింది. ఈ సెషన్స్ పూర్తయ్యే వరకూ సభలోకి రేవంత్‌కి నో ఎంట్రీ కార్డు పడింది.
అయితే, ఆంధ్రాలో ఇదే పరిస్థితి ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాకి ఎదురైంది. ముఖ్యమంత్రితోపాటు మరో ఎమ్మెల్యే అనిత పట్ల అభ్యంతకరంగా వ్యవహరించారన్న ఆరోపణతో రోజాను ఏకంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారు ఏపీ స్పీకర్. ఆ తరువాత, ఆమె కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కకుండా పోయింది. బేషరతుగా క్షమాపణలు చెబితే తప్ప… ఆమెకి సభలోకి నో ఎంట్రీ అంటూ తెలుగుదేశం పార్టీ భీష్మించుకుని కూర్చుంది. సభలో రోజా వ్యవహరించిన తీరు మర్యాదకరంగా లేదంటూ తెలుగుదేశం ఇప్పటికీ వాదిస్తోంది.
ఆంధ్రాలో రోజాకి ఎదురైన పరిస్థితి లాంటిదే.. ఇప్పుడు తెలంగాణలో రేవంత్‌కు ఎదురైంది. అయితే, ఇక్కడికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ రెండో నాలుక మరోసారి బయటకి వచ్చిందని చెప్పాలి! తెరాస అనుసరిస్తున్న వైఖరిని రేవంత్ తప్పుబడుతున్నారు. న్యాయపోరాటం అంటూ హైకోర్టుకు కూడా వెళ్తున్నారు. అంతేకాదు… గవర్నర్ ప్రసంగం అడ్డుకున్నారంటూ సభ నుంచి సస్పెండ్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటున్నారు. గవర్నర్ స్పీచ్ తరువాత సభ మొదలౌతుందనీ, ఈలోగా జరిగిన పరిణామాలపై శాసన సభ స్పీకర్ ఎలా చర్యలు తీసుకుంటారంటూ లాజిక్ మాట్లాడుతున్నారు.
ఆంధ్రాలో రోజా విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరించిన వైఖరిని తప్పే. రేవంత్ విషయంలో తెరాస వైఖరి కూడా తప్పుబట్టాల్సిందే. అది వేరే చర్చ. కానీ, ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రాధమ్యాలను ఇక్కడ మనం గమనించాలి! ఆంధ్రాలో అధికారంలో ఉండగా తాము ఏం చేసినా రైట్ అన్నట్టు తమ్ముళ్లు మాట్లాడతారు. అదే పరిస్థితి తెలంగాణకు వచ్చేసరికి… ప్రతిపక్ష పార్టీ హక్కుల్ని కాలరాస్తున్నారంటూ కోర్టులకు వెళ్తారు. ఆంధ్రాలో రోజా కోర్టు వెళ్తే తెలుగుదేశం తప్పుబట్టింది. ఇప్పుడు అదే పార్టీ రేవంత్ విషయంలో న్యాయపోరాటం అంటోంది..! ఈ ద్వంద్వ వైఖరిని ఏమనాలో..?