ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం తెలంగాణ రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు తావిస్తోంది. ఇదే అంశమై తెరాస వైఖరిని ప్రశ్నిస్తూ విమర్శలకు దిగారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. తెరాసలో యజమానులు, పనివాళ్ల పోరాటం జరుగుతోందన్నారు. ప్రత్యేక హోదా అంశమై రకరకాల వాదనలు తెరాస నుంచి వినిపిస్తున్నాయన్నారు. పార్లమెంటులో ఏపీ హోదాకి ఎంపీ కవిత మద్దతు తెలిపారనీ, కానీ వినోద్, హరీష్ లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. ఈ అంశమై వారికే స్పష్టత లేనప్పుడు, కాంగ్రెస్ వైఖరి ఏంటంటూ మధ్యలో తమని ప్రశ్నించే అర్హత వారికి లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నారనీ, కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనీ కాబట్టి ప్రత్యేక హోదాపై వారే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
స్పెషల్ స్టేటస్ విషయమై కాంగ్రెస్ కి పూర్తి స్పష్టత ఉందనీ, సోనియా గాంధీ మాట, సీడబ్ల్యూసీ తీర్మానమే తమకు ఫైనల్ అనీ, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ నిర్ణయాల్లో ఎప్పటికప్పుడు మార్పులు ఉండవని రేవంత్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ కవిత, హరీష్ రావులు రకరకాలుగా ఎందుకు మాట్లాడుతున్నారనీ, ఏకాభిప్రాయం ఎందుకు ఉండటం లేదన్నారు. అంతేకాదు, ఇదే సమయంలో తెరాస వారసత్వ పోరు అంశాన్ని కూడా మళ్లీ తెరమీదికి తెచ్చే ప్రయత్నం చేశారు రేవంత్. అధికార పార్టీలో వర్గపోరు పతాక స్థాయికి చేరుకుందనీ, మంత్రి హరీష్ రావును త్వరలోనే పార్టీ నుంచి స్వయంగా సీఎం కేసీఆర్ గెంటేయడం ఖాయమని రేవంత్ జోస్యం చెప్పడం ఆసక్తికరం. కేసీఆర్ దోపిడీని తాను ప్రశ్నిస్తూనే ఉంటాననీ, తనపై ఎంతమంది ‘రావులు’ కేసులు పెట్టినా భయపడే స్వభావం తనది కాదని రేవంత్ అన్నారు.
నిజానికి, పార్లమెంటులో టీడీపీ అవిశ్వాసం సందర్భంగా కూడా ఏపీ హోదాపై తెరాస వైఖరి ఇలానే గందరగోళంగానే ఉంది. లోక్ సభలో ఓటింగ్ ఉంటుంది కాబట్టి.. దానిలో పాల్గొనకుండా తెరాస ఎంపీలు బయటకి వెళ్లిపోయారు. కానీ, రాజ్యసభకు వచ్చేసరికి.. కేవలం చర్చ మాత్రమే జరుగుతుంది కాబట్టి, ఎంపీ కేశవరావు ఏపీ హోదాకి కాస్త అనుకూలంగా మాట్లాడారు. లోక్ సభలో తెరాస ఎంపీల తీరు చూశాక… పొరుగు రాష్ట్రానికి సాయం చెయ్యరా అంటూ విమర్శలు వినిపించాయి. దీంతో రాజ్యసభకు వచ్చేసరికి వైఖరిలో కొంత మార్పు కనిపించింది. అయితే, ఇదే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి స్పష్టమైన వైఖరి ఆశించలేం! ఎందుకంటే, ఆయన ఇంకోపక్క కేంద్రంతో ఈ మధ్య దోస్తానా పెంచుకున్నారు కదా! కాబట్టి, ఈ అంశమై రేవంత్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా తెరాస నుంచి పెద్దగా స్పందన ఉండే అవకాశాలు తక్కువ. కొంత విరామం తరువాత ఏపీ అంశంతో తెరాసపై విమర్శలకు రేవంత్ దిగడం కూడా ఆసక్తికరమే. ఇకపై ఈ దూకుడు కొనసాగిస్తారేమో చూడాలి.