పార్టీ వీడుతున్నారు కాబట్టి టీడీపీ నేతలపై రేవంత్ విమర్శలు చేస్తున్నారు, పదేళ్ల కిందట టీడీపీలోకి వస్తే పార్టీ ఆయనకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందీ, పార్టీ కట్టుబాట్లను కాలరాస్తున్నట్టు వ్యవహరిస్తున్నారూ, రేవంతుడి కోసమే నాగం జనార్థరెడ్డినీ ఎర్రబెల్లి దయాకరరావును పార్టీ వదులుకుందీ, ఇస్తున్న ప్రాధాన్యతను దుర్వినియోగం చేస్తున్నారూ, పార్టీ మూల సిద్ధాంతాలను పక్కన పెట్టేశారూ… ఇలా ఏపీ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డిపై ఎవరికి నచ్చిన కోణంలో వారు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ వైపు రేవంత్ అడుగులేస్తున్నారంటూ తప్పుబడుతున్నారు. ఇవన్నీ కాసేపు పక్కనపెడితే… తెలుగుదేశం నాయకుల తీరుపై రేవంత్ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు..? వాస్తవంగా ఆలోచిస్తే… ఆయన టీడీపీలోనే కొనసాగాల్సిన పరిస్థితి ఉంది. ఓటుకు నోటు కేసు అలానే ఉంది! కాబట్టి, అధికార పార్టీ అండ అవసరం అనే విషయం ఆయనకి తెలియందా..? రేవంత్ తాజా వ్యాఖ్యల వెనక అసలు ఉద్దేశం పార్టీని వీడటమేనా..?
పార్టీ కోసం రేవంత్ చాలానే చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓటుకు నోటు కేసులో ఆయన వ్యక్తిగత లాభాపేక్ష ఏదైనా ఉందా? పార్టీ ఆదేశించకుండా ఎమ్మెల్సీలతో బేరసారాలు సాగించరు కదా! ఏం చేసినా, ఎవరి కోసం చేసినా అది తప్పు కాబట్టి.. చట్టం తన పని తాను చేసింది. ఆయన రాజకీయ జీవితంలో ఓటుకు నోటు కేసు ఓ పెద్ద కుదురు అనే చెప్పాలి. ఆ సమయంలో జైలుకు వెళ్లారు. కూతురి పెళ్లికి కూడా జైలు నుంచి వచ్చి అక్షింతలు వేసి.. సాయంత్రానికి మళ్లీ వెళ్లిపోయారు. రేవంత్ తాజా వ్యాఖ్యల్లో ఇదే ఆవేదన ధ్వనించింది. ‘పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నా. రాష్ట్రంలో టీడీపీని కాపాడేందుకు రక్తం ధారపోస్తున్నా. ఓ రకంగా చెప్పాలంటే సమరం సాగిస్తున్నా. ఇలాంటప్పుడు పార్టీ నుంచి ఏ స్థాయిలో మద్దతు అందాలి..? కానీ, మీరేం చేస్తున్నరు.. ఆయన (కేసీఆర్) వద్దకు వెళ్లి భజనలు చేస్తున్నరు. కాంట్రాక్టులు తెచ్చుకుంటరు, పనులు చేయించుకుంటరు. ఆయన కనిపిస్తే రెడ్ కార్పెట్లు వేస్తరు. ఇదంతా మమ్మల్ని అవమానిస్తున్నట్టు అనిపించడం లేదా?’ అనేది రేవంత్ సూటి ప్రశ్న.
తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగానే టీడీపీ ఇన్నాళ్లూ వ్యవహరిస్తూ వచ్చింది. కానీ, ఈ మధ్య సమీకరణాలు హఠాత్తుగా మారిపోయాయి. కేసీఆర్ ను టీడీపీ మచ్చిక చేసుకుంటోందా, లేదంటే కేసీఆరే టీడీపీని దగ్గరకు తీసుకుంటున్నారనే అనేది పక్కన పెడితే… ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని పార్టీకి దూరం కావాల్సిన అనివార్యత ఏర్పడింది! ఈ అనివార్యతకు అసలు కారణం ఎవరు… ముమ్మాటికీ తెలుగుదేశం నేతల వైఖరే. పార్టీ కోసం రేవంత్ చేసిన పోరాటాలను వదిలేసి… ఓ సాధారణ నాయకుడు పార్టీ వీడితే స్పందించిన రీతిలో ఏపీ టీడీపీ నేతలు ఇప్పుడు విమర్శిస్తున్నారు. రేవంత్ ఆవేదన ఒక్కటే… తన జీవితాన్ని పణంగా పెట్టి పార్టీ కోసం పోరాడుతుంటే, కేసీఆర్ కి అనుకూలంగా ఎలా వ్యవహరిస్తుందనేది! ఈ ఆవేదన ఇతర నేతలకు అర్థం అవుతున్నట్టు లేదు. అందుకే, తానువచ్చే వరకూ సంయమనంతో ఉండాలంటూ విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పార్టీ నేతలకు సూచిస్తున్నారు. కానీ, ఈలోపు వీళ్లు ఆగడం లేదు. ఇంతకీ, టీడీపీని వదిలి వెళ్తానని రేవంత్ ఎక్కడైనా సూటిగా చెప్పారా.., లేదు కదా! కానీ, వెళ్లబోతున్నారు కాబట్టే ఇలా వ్యాఖ్యానిస్తున్నారనే కోణం నుంచే రేవంత్ ను చూస్తున్నారు. తమ వైఖరి వల్లనే రేవంత్ ఇలా మాట్లాడాల్సి వచ్చిందనే కోణం నుంచి టీడీపీ నేతలు ఆలోచించడం లేదు!