ప్రతిపక్షాలపైన జెఎసి చైర్మన్ కోదండరాంపైన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోపణలు అవహేళనలపై మిగిలిన నేతల స్పందనకు భిన్నంగా టిడిపి నేత రేవంత్ రెడ్డి స్పందించారు. జానారెడ్డి, కోదండ ప్రధానంగా రాజకీయాంశాలకు పరిమితమైతే రేవంత్ తాగుడుతో సహా రకరకాల విషయాలు గుప్పించారు. మంత్రి పదవి కోసం తుమ్మల నాగేశ్వరరావును బ్రోకర్‌గా చంద్రబాబు దగ్గరకు పంపించినట్టు గుర్తు చేశారు. అప్పటి ి పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను బతిమాలినట్టు కూడా గేళి చేశారు. పరిటాల రవీంద్రను హత్యచేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వున్న కెసిఆర్ ఇప్పుడు సమాధి దగ్గర నివాళులర్పించడమేమిటన్నారు. పయ్యావుల కేశవ్ నుంచి ఇప్పుడు కెసిఆర్‌తో వున్నారని చెబుతున్న ఎపి టిడిపి నేత నరసింహనాయుడు వరకూ తమ పార్టీవారిని కూడా వదలకుండా విమర్శించారు. ఎత్తిపోతల పథకం అంటే ఆపకుండా తాగడమే నరసింహనాయుడు టాలెంట్ అంటూ అందుకే ఆయనతో కలసి మజా చేసేందుకు తెచ్చిపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్తో పొత్తు గురించి వచ్చిన సూచనలను కొట్టిపారేస్తూ అలాటి దొంగలతో పొత్తు పెట్టుకుంటే ఇంట్లో కూడా ముఖం చూపించలేమని ఎగతాళి చేశారు. మొత్తంపైన కెసిఆర్ భాషను మించి రేవంత్ మాట్లాడిన తీరు కూడా టిడిపిని ఇబ్బందిలో పెడితే ఆశ్చర్యపోనవసరం లేదు.