తమ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా చేజారిపోతూ ఉంటే ఎవ్వరికైనా కడుపు మండడం సహజం. కుత్బుల్లాపూర్ తెలుగుదేశం ఎమ్మెల్యే వివేక్గౌడ్ తెరాసలోకి ఫిరాయించిన నేపథ్యంలో తెదేపా నాయకులు ఇలాంటి కడుపుమంటనే వెళ్లగక్కుతున్నారు. కేసీఆర్ ఒక మానసిక రోగిలాగా వ్యవహరిస్తున్నాడని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచేలా.. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలు అనేవే లేకుండా చేయాలని చూస్తున్నారని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం.
వివేక్ గులాబీ పార్టీలో చేరిన తర్వాత.. తెదేపా అధ్యక్షుడు రమణ, రేవంత్రెడ్డి తదితరులు ప్రెస్మీట్ నిర్వహించారు. తెదేపానుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు అందరూ తమ తమ పదవులకు రాజీనామాలు చేసి.. తిరిగి ప్రజల తీర్పుకోసం ఎన్నికల్లోకి దిగాలని ఎల్.రమణ డిమాండ్చేశారు. రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల అస్తిత్వమే లేకుండా చేయాలని చూసిన ఏ పార్టీ, ఏ నాయకుడు కూడా బాగుపడినట్లుగా దేశ రాజకీయాల్లో దృష్టాంతాలు లేవని అన్నారు.
ప్రజలు తెరాసకు స్పష్టమైన పాలనాధికారాన్ని ఇచ్చారని, రాష్ట్ర పాలన, గ్రేటర్ కార్పొరేషన్ పాలన గురించి కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చారని.. పాలన మీద దృష్టిపెట్టడానికి బదులు ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి కుట్రలు చేయడం తగదని అన్నారు. తెదేపా ఎమ్మెల్యేల మీద వారి వ్యాపారాల మీద రకరకాల దాడులు చేయిస్తామంటూ ఒత్తిళ్లు తీసుకురావడం ద్వారా కేసీఆర్.. వారిని గులాబీ పార్టీలోకి రప్పిస్తున్నారని ఆరోపించారు. మీ వ్యాపారాలు ఎలా చేసుకుంటారో చూస్తాం అంటూ బెదిరిస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ వైఖరిని తీవ్రంగా విమర్శించిన రేవంత్రెడ్డి.. తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం వారికి ఇంకా పెద్ద పదవులు కట్టబెట్టడం కోసం తన పార్టీ బలాన్ని పెంచుకోవడానికి ఇలాంటి అనేక కుట్రలు చేస్తున్నారని.. ఆయన పార్టీలో ముసలం పుట్టే రోజు కూడా వస్తుందని.. అప్పుడు ఆయన ఇంతకింతా గుణపాఠం అనుభవించాల్సి వస్తుందని శాపనార్థాలు పెట్టారు.