హైదరాబాద్: రాజకీయ సన్యాసం సవాల్‌పై టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మళ్ళీ మాట మార్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా – 100 స్థానాలు గెలిచి తీరుతామని కేటీఆర్ చేసిన సవాల్‌పై స్పందిస్తూ, టీఆర్ఎస్కు 100 స్థానాలు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ ప్రతి సవాల్ విసరటం, ఫలితాలు వెలువడుతున్నపుడు టీఆర్ఎస్100కు చేరువవుతున్నట్లు కనిపించిన సమయంలో మీడియావారు అడగగా, సవాల్ విసిరింది తాను కాదని, తాను కేవలం కేటీఆర్ సవాల్‌కు ప్రతిస్పందించానని అని తప్పించుకోవటం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త వాదన మొదలుపెట్టారు. గ్రేటర్ సవాల్లో తనదే విజయమని చెప్పారు. 100 సీట్లకు ఒక్క సీటు తగ్గటంతో కేసీఆర్, కేటీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. నిన్న కూకట్పల్లి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు వివేక్, రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరతారని తాను ఊహించలేదని రేవంత్ అన్నారు. ఎమ్మెల్యేలు ఎందుకు లొంగుతున్నారు? కేసీఆర్ ఎందుకు టీడీపీపై కక్ష గట్టారు? అన్న ఆలోచనలతో నిన్నరాత్రి నిద్ర పట్టలేదని, తెల్లవారు ఝామున స్పష్టత వచ్చిందని చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గుర్తుకు వచ్చారని, “నీకు తోడుగా నేనుంటా… నువ్వు పోరాడు” అని తనకు జ్ఞానోదయం కలిగించారని భావించానన్నారు. బూత్ స్థాయినుంచే కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి 2019 ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి తీరుతానని రేవంత్ చెప్పారు.