తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి..ఆ పదవిని పొందడానికి సొంత పార్టీలోని పోటీ దారుల నుంచే కాదు.. ఇతర పార్టీలు వేసిన పాచికలను కూడా.. సమర్థవంతంగా అధిగమించాల్సి వచ్చింది. ఇప్పుడు.. అంతకంటే ఎక్కువ రాజకీయ నైపుణ్యతను… చూపించి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించాల్సి ఉంది. ఎందుకంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్వీర్య దశకు చేరుకుంది. వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నిఖార్సైన నాయకుడు లేకుండా పోయారు. ఉన్న నేతలంతా స్వల్ప కాలిక ప్రయోజనాల కోసం అధికార పార్టీలతో కుమ్మక్కు కావడంతో… ప్రజల్లోనూ విశ్వాసం కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదేమో అన్న ఆలోచనకు వస్తున్నారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ అభిప్రాయాన్ని ముందుగా మార్చాల్సి ఉంది. నిజానికి తెలంగాణలో కేసీఆర్‌ను భయపడకుండా ఢీకొట్టే ఒకే ఒక్కరాజకీయ నేతగా రేవంత్ రెడ్డికి పేరు ఉంది. అది .. ఆయనను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయగానే… కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ వేవ్ తీసుకు వచ్చింది. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా జరిగిన ప్రచారం.. ఓ రేంజ్లో ఉంది. ఓ ఊపు వచ్చింది. రాజకీయాలపై సాధారణ ఆసక్తి ఉన్న ప్రజల్లోనూ.. కాంగ్రెస్ హైకమాండ్ ఇన్నాళ్లకు ఓ మంచి నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమయింది. అంటే రేవంత్ రెడ్డిపై… చాలా మంది ఎన్నో అంచనాలు పెట్టుకున్నారన్నమాటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పై బాధ్యత చాలా ఎక్కువగా ఉన్నట్లే. ఆయన ముందు ఉన్న మొదటి సవాల్ హుజూరాబాద్ ఉపఎన్నిక.
ఇప్పటికే అక్కడ టీఆర్ఎస వర్సెస్ బీజేపీ అనే పరిస్థితి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి చాలా కాలం అయింది. మొదట్లో టీడీపీ గెలిచేది.. ఆ తర్వాత టీఆర్ఎస్ కంచుకోట అయింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అక్కడ గొప్ప ట్రాక్ రికార్డు లేదు. అలాంటి చోట.. కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోయినా.. కనీసం గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితికి తీసుకెళ్లగలిగితేనే.. రేవంత్ రెడ్డి మొదటి అడుగులో తనదైన విజయం సాధించినట్లుగా భావిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో… క్యాడర్ మద్దతు రేవంత్‌కే ఉండొచ్చు కానీ. . ఆయన పీసీసీ చీఫ్ అయితే.. తమకు ఏదో నష్టం జరుగుతుందని… భావించే సీనియర్లు చాలా మంది ఉన్నారు. వారందరూ వెనక్కి లాగేందుకు తమ వంతుప్రయత్నం చేస్తారు. అన్నింటినీ సమన్వయం చేసుకుని.. రేవంత్ రాజకీయం చేయాల్సి ఉంది. ఆ సామర్థ్యం.. దూకుడు.. ఉత్సాహం రేవంత్‌కు ఉన్నాయి. కాలం కలసి వస్తే.. సక్సెస్ అవుతారు.. లేదంటే కేసీఆర్ వ్యూహాలకు చిక్కి శల్యమైపోయిన మరో విఫల నేతగా మిగిలిపోతారు.